Thursday, November 14, 2024

ఆక్రమించారు తమ్మిడికుంట వద్ద 3.30 ఎకరాలు ఆక్రమించిన ఎన్​ కన్వెన్షన్‌

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం ఇవాళ కూల్చి వేసింది. ఈ మేరకు కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎన్​ కన్వెన్షన్‌ ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్ కలిపి 3.30 ఎకరాలు ఆక్రమించినట్లు తెలిపారు. దూడుకు మీదున్న హైడ్రా తాజాగా హైదరాబాద్‌ మాదాపూర్‌ పరిధిలో సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్​ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఈ మేరకు కూల్చివేతపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించి, ఓ ప్రకటనను విడుదల చేశారు. తుమ్మడికుంట చెరువు పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని ఆక్రమణలు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారన్నారు. తుమ్మిడికుంటలోని అనధికార నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ఒకటిగా చెప్పుకొచ్చారు.

చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్‌ జోన్‌ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో మొత్తంగా 3.30 ఎకరాల ఆస్తిలో అక్రమంగా ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని చెప్పుకొచ్చారు. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌ ప్రయత్నించిందని, సంబంధిత అధికారులు బీఆర్‌ఎస్‌కు అనుమతించలేదని రంగనాథ్‌ ప్రకటనలో వివరించారు.

“తుమ్మడికుంట చెరువుపై 2014లో హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నోటిఫికేషన్‌ తర్వాత ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం తెలంగాణ హైకోర్టుకు వెళ్లింది. చట్టబద్ధంగా ఉండాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది. 2017లో ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్) సర్వే నివేదికపై కేసు పెండింగ్‌లో ఉంది. ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే విధించలేదు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ రెండింటీకి సంబంధించి ఎన్‌ కన్వెన్షన్‌ తప్పుదోవ పట్టించింది. తప్పుదోవ పట్టించి కమర్షియల్ ప్రోగ్రామ్స్ సాగించింది.” అని హైడ్రా కమిషనర్​ రంగనాథ్‌ ప్రకటనలో తెలిపారు.

శాటిలైట్‌ ఫొటోల ద్వారా ఆక్రమణలు గుర్తిస్తున్నాం : భట్టి

ఎన్‌ కన్వెన్షన్​ కూల్చివేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువులు ఆక్రమణకు గురికాకూడదనే హైడ్రా ఏర్పాటు చేశామన్న భట్టి, హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చాక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నేరుగా చెరువులో కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్లలో చెరువుల ఆక్రమణపై శాటిలైట్‌ ఫొటోల ద్వారా గుర్తిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి, విభజనకు ముందు, తర్వాత చెరువుల ఆక్రమణలు గుర్తించి, ఆ వివరాలు ప్రజలముందుంచుతామని వెల్లడించారు. ప్రజల ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యతని భట్టి విక్రమార్క తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular