Tuesday, May 6, 2025

రవాణా శాఖలో రెవెన్యూ పెంపునకు అధికారులు చర్యలు చేపట్టాలి

  • స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌లపై వెంటనే తనిఖీలు నిర్వహించాలని చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలి
  • రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి 
  • అధికారులను ఆదేశించిన రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణా శాఖలో చట్టానికి లోబడి రెవెన్యూ పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆదాయ అన్వేషణను చట్ట ప్రకారమే చేపట్టాలని ఆయన సూచించారు. దీంతోపాటు స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌లపై తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ అధికారుల సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్లు , ఆర్టీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేసి చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. త్రైమాసిక పన్నుల వసూళ్లకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. 100 శాతం పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను ఆయన అభినందించారు. ఈ సమావేశానికి రాని అధికారులపై నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ కోరాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అధికారులు శాఖ గౌరవాన్ని పెంపొందించాలి
రవాణా శాఖ మంత్రిగా మొదటిసారి డిటిసిలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని అధికారులు హుందాగా వ్యవహారిస్తూ రవాణా శాఖ గౌరవాన్ని పెంపొందించాలని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు కావల్సిన సొంత భవనాల కోసం ల్యాండ్ సెర్చ్ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించి సొంత భవనాల సమస్య పరిష్కారించుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల్లో విధిగా వాహనాలు తనిఖీ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని మంత్రి పొన్నం సూచించారు. అధికారులు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుతం ఉన్న రవాణా శాఖకు సంబంధించిన వాహనాలను ఒకే గూటికి తీసుకొచ్చే విధంగా స్టిక్కరింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై రవాణా శాఖ అన్ని స్కూల్ లు, కాలేజీల్లో రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని డ్రైవర్లకు ,స్కూల్ బస్సులకు కచ్చితంగా ఫిట్‌నెస్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.

అవినీతి అడ్డుకట్టకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బలోపేతం…
రోడ్డు భద్రతపై రవాణా శాఖ అధికారులు జిల్లాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం సూచించారు. వారం రోజుల పాటు స్కూళ్లు, కాలేజీల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థికి రోడ్డు భద్రతపై కనీస అవగాహన ఉండేలా చూసుకోవాలన్నారు. దీంతోపాటు గతంలో కారు డోర్‌లకు బ్లాక్ ఫిలిం గ్లాస్ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలపరిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని మంత్రి అధికారులకు సూచించారు. సీజ్ అయిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహారించాలని వాహనాలను భద్రపరిచే ప్రదేశాలపై జిల్లా పోలీస్ అధికారులతో కో ఆర్దినేట్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఆటో రిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ , ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీని రూపొందించాలన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డిసెంట్రలైజ్ ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఏదైనా భిన్న ఆలోచన వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. స్కూల్ బస్సుకు సంబంధించి డ్రైవర్, క్లీనర్, బస్సు సమయాలు తెలిపే విధంగా ప్రతి పాఠశాల యాజమాన్యం స్కూల్ బస్ యాప్‌లో అప్‌డేట్ చేస్తే పూర్తి సమాచారం తల్లిదండ్రులకు తెలిసేలా ప్రమాదాలు నివారించేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ,జాయింట్ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్లు ప్రవీణ్, రమేష్ మమతలుపాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com