Friday, April 4, 2025

రెండోరోజూ కూడా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ తనిఖీలు

  • హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల
  • పరిధిలోని పలు బస్సులపై కేసులు నమోదు

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో రెండోరోజూ కూడా విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు తనిఖీ చేశారు. మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయడంతో పాటు కేసులను రవాణా శాఖ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో 2,234 బస్సులు, రంగారెడ్డిలో 5,500, మేడ్చల్‌లో 4,120 బస్సులు ఉండగా అందులో ఫిట్‌నెస్ లేని బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు జరిపిన తనిఖీల్లో ఫిట్‌నెస్ లేని 46 విద్యాసంస్థల బస్సులపై కేసులను నమోదు చేయగా రెండోరోజు కూడా ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఫిట్‌నెస్ లేని, పన్నులు చెల్లించని 38 బస్సులపై కేసు నమోదు చేసినట్టు ఉమ్మడి రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాల్సిందే….
గురువారం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టినట్టు ఉమ్మడి రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. ఫిట్‌నెస్ లేని,15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితులలో రోడ్ల పైకి తిప్పరాదని ఆయన సూచించారు. అనుభవం గల, 60 సంవత్సరాలు మించని డ్రైవర్లను నియమించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి విద్యా సంస్థ బస్సు తప్పనిసరిగా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణా శాఖ అధికారులు కిరణ్ రెడ్డి, కృష్ణ వేణి, సునీత, నవీన్, ఉపాసిని, ప్రతాప్ రాజా, త్రివేణి, శ్రీనివాస్, సీతల్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో 21 బస్సులపై కేసులు
ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. రెండోరోజు హైదరాబాద్ జిల్లాలో గురువారం 21 స్కూల్ బస్సులపై కేసు నమోదు చేశారు. అందులో 16 స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ లేని కారణంగా కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. మిగతా బస్సులకు పర్మిట్ లేని కారణంగా కేసు నమోదు చేసినట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన తనిఖీల్లో హైదరాబాద్‌లో 25 బస్సులపై కేసులు నమోదు చేశారు.

నిబంధనలు అతిక్రమించిన బస్సులపై కేసులు
విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల్లో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు ఎక్కుతున్నాయని, సరైన నియమ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు స్కూళ్లు ప్రారంభమైనా మొదటి రోజు రోజు నుంచే తనిఖీలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న బస్సులపై రెండు రోజులుగా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు స్కూల్ బస్సుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం వంటి ఏరియాల్లో ప్రైవేట్ స్కూల్ బస్సులపై దాడులు నిర్వహించారు. బస్సుల కండీషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్‌లను చెక్ చేశారు. అలాగే బస్సు డ్రైవర్ లైసెన్స్‌తో పాటు అటెండర్ లేని బస్సులపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కేసులు నమోదు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com