కొద్ది రోజులుగా జెట్ స్పీడుతో పెరుగుతున్న ధరలు..
కొద్దిరోజులుగా జెట్ స్పీడులో పెరుగుతున్న బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. తులం (10 గ్రాములు) బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలు చేరింది. దీంతో సామాన్యుడు బంగారం కొనడం కాదు పేరు వింటేనే బెంబేలెత్తిపోయేలా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా బంగారానికి రెక్కలొచ్చాయి.
బంగారంపై పెట్టుబడే సురక్షితమని అందరూ నమ్ముతుండటంతో ఇటీవల కాలంలో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఇలా రోజురోజుకు పెరుగుతూవచ్చిన బంగరం ధర సోమవారం ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. సోమవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,016 కు చేరుకుంది. దేశంలో ఒక్కో నగరంలో ఒక్కోలా బంగారం ధరలు ఉంటాయి… కొన్ని నగరాల్లో ఇప్పటికే తులం బంగారం లక్షకు చేరితే మరికొన్నినగరాల్లో నేడు ఈ మార్క్ దాటే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగువనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం 98,350 గా ఉంది. మరో రూ.1,650 పెరిగితే ఇక్కడ కూడా లక్ష రూపాయలకు టచ్ అవుతుంది. అయితే ఇది ఎంతో దూరం లేదని… ఒకటిరెండు రోజుల్లో హైదరాబాద్ లో కూడా బంగారం లక్ష రూపాయల మార్కును దాటడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.