Tuesday, April 22, 2025

వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానమీ మా లక్ష్యం

  • తెలంగాణకు భారీగా పెట్టుబడులు రాక
  • దావోస్‌ ఒప్పందాలతో  రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు
  • స్కిల్ ‌యూనివర్సిటీ కోసం సింగపూర్‌తో ఒప్పందం
  • పెట్టుబడులపై కొందరు వెకిలి వ్యాఖ్య‌లు
  • రాష్ట్ర‌ అభివృద్దిపై దుష్ప్రచారాలు
  • మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో సిఎం రేంవత్‌ ‌రెడ్డి

తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దావోస్‌ ‌సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన‌ సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు దీనిని జీర్ణించుకోలేక వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ప్రభుత్వంపై కొందరు చేసిన దుష్ప్రచారం పటాపంచలైంది. ప్రభుత్వంపై, రాష్ట్రంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులకు చాలామంది ముందుకొచ్చారు. అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం వివరించారు.  తెలంగాణ రాష్ట్రాన్ని వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇది మా ప్రభుత్వం సాధించిన కీలక విజయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై దుష్పచారం చేశారని మండిపడ్డారు. దావోస్‌ ‌పర్యటనతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని చెప్పుకొచ్చారు. ఇది నిరంతర పక్రియ అని చెప్పారు. రాజకీయంగా విభేదించినా రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లొద్దని హితవు పలికారు. పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. మనందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సింగపూర్‌ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఇది భవిష్యత్‌లో మన సాంకేతికను పెంపొందించ డానికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకుని రావాలనేది మా ప్రయత్నం అని అన్నారు వాళ్లు ఇక్కడి నుంచి విదేశాలకు నిధులు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్మునే విదేశీ పెట్టుబడులుగా చూపారు. మేం విఫలమైతే పైశాచిక ఆనందం పొందాలని కొందరు చూశారు. ఇతర రాష్ట్రాల కంటే గొప్పగా పెట్టుబడులు సాధించాం.

అసూయతోనే మమ్మల్ని వారు అభినందించడం లేదు. భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపుమంటగా ఉందని పరోక్షంగా బిఆర్‌ఎస్‌ ‌నేతలను ఉద్దేశించి అన్నారు.  ప్రతిపక్షంలో ఓ నేత అటెన్షన్‌ ‌డిజార్డర్‌తో బాధపడుతున్నారు. చాలా సంస్థలు మన పెవిలియన్‌కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో ఈస్థాయిలో పెట్టుబడులు రాలేదనే అక్కసుతో ఉన్నారు. ఎనర్జీ పాలసీతోనే తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు దావోస్‌ ‌వెళ్లాం. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాం.  తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌వర్సిటీ కోసం సింగపూర్‌ ‌ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాం. స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌లో ఇదో అద్భుత పరిణామం‘ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దావోస్‌ ‌పర్యటనలో గతేడాది కంటే నాలుగు రేట్లు ఎక్కువ పెట్టుబడులు వొచ్చాయని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలు, యువతకు మేలు చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ఎన్ని విమర్శలు చేసినా సలహా లాగే తీసుకున్నామన్నారు. సింగపూర్‌ ‌ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు. సాంకేతిక నైపుణ్యం, విద్యార్థుల బదిలీ జరిగేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.

రూ.450 కోట్లతో స్కిల్‌ ‌సెంటర్‌ ఏర్పాటుకు క్యాపిటలాండ్‌ ‌ముందుకొచ్చిందని చెప్పుకొచ్చారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మల్టీవాక్‌ ‌గ్రూప్‌తో ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. దావోస్‌ ‌పర్యటనలో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని ఉద్ఘాటించారు. వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానమీ దిశగా అడుగుపడిందని చెప్పారు. మూసీ పునరుజ్జీవం, యువతకు ఉపాధిపై దృష్టి పెట్టామని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేసి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తామన్నారు. హైదరాబాద్‌ అం‌టేనే .. బిజినెస్‌ అనే బ్రాండ్‌ ఏర్పడిందని చెప్పుకొచ్చారు. సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

‘గతేడాది దావోస్‌ ‌సదస్సులో రూ.40వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. ఇది స్థిరమైన, వ్యాపార అనుకూలమైన ప్రభుత్వం అని వ్యాపారులు విశ్వసించారు. అందుకే 2024 దావోస్‌ ‌పర్యటనకంటే ఈసారి నాలుగు రెట్లు అధికంగా ఒప్పందాలు జరిగాయి. అధునాతన సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చేలా ప్రణాళిక రూపొందించాం అని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతకు అందించేలా స్కిల్‌ ‌యూనివర్సిటీ ప్రణాళిక ఉంది.  దావోస్‌ ఒప్పందాల పెట్టుబడులతో కొత్తగా 49,500 ఉద్యోగాలు వస్తాయి. మూసీ నదిని ప్రక్షాళన చేసి నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అదిస్తాం అని శ్రీధర్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో  ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com