ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నేతలం నిరాశ, నిస్పృహలో ఉన్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు. తాను ఉన్న మాటే చెబుతున్నానుని, దీనిలో దాపరికం ఏమీ లేదని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పారు. ఓటరు నమోదు కార్యక్రమంలో కూడా తాము పాల్గొనలేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెప్పారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలున్నాయని, గతంలో కూడా బీఆర్ఎస్ పోటీ చేయని సందర్భాలు ఉన్నాయని అన్నారు. మోదీ సర్కార్ వెంటనే దేశంలో జనాభా లెక్కింపు జరపాలని డిమాండ్ చేశారు. కులగణన నుంచి తప్పించుకోవటానికే మోదీ.. జనగణన చేయటంలేదని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు నుంచి తప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. డీ లిమిటేషన్ జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, 2026లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని విభజన చట్టంలో ఉందన్నారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ ప్రభావం వల్ల వాయిదా పడ్డాయన్నారు.