Wednesday, November 20, 2024

ఓవర్‌లోడ్ తుక్కుగా మారుతున్న ఆర్టీసి బస్సులు..!

  • ఓవర్‌లోడ్ తుక్కుగా మారుతున్న ఆర్టీసి బస్సులు..!
  • ఆక్యుపెన్సీ పెరగడంతో బస్సులు షెడ్డుకు ?
  • 14- నుంచి 15 లక్షల కి.మీ దాటినా తుక్కుకు వెళ్లాల్సిన ఆర్టీసి బస్సులు ఇంకా రోడ్లపైనే…
  • ఆ బస్సులను నడపడానికి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్‌లు

ఒకప్పుడు ఆర్టీసి బస్సుల్లో 65 నుంచి -68 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంటే, మహాలక్ష్మి పథకం తర్వాత అది 100 నుంచి 114 శాతానికి చేరింది. అయితే ఆర్టీసి బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఎక్కుతున్నందుకు సంతోషించాలా, దానివల్ల బస్సులు తుక్కుగా మారుతున్నాయని బాధపడలా అన్న విషయమై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టిన తరువాత నుంచి బస్సులో రద్దీ మరింత ఎక్కువైంది. ఫిబ్రవరి 19వ తేదీన (సోమవారం) ఏకంగా 114.28 శాతం ఓఆర్ నమోదవ్వగా, 20వ తేదీన 108.38 శాతం నమోదైంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. గతంలో 8 లక్షల కి.మీ దాటిన బస్సులను తుక్కుగా మార్చేవారు. ప్రస్తుతం 14- నుంచి 15 లక్షల కి.మీ దాటినా ఆ బస్సులను నడిపిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే పాత బస్సులు పలుసార్లు బ్రేక్‌డౌన్‌లు అవుతున్నాయి. నిర్వహణ సమస్యలు సైతం అధికం కావడంతో మెకానిక్‌లు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెపాసిటీ పెరగడం వల్ల ఓవర్ వెయిట్ అయ్యి బస్సులు తుక్కు పడుతున్నాయని డ్రైవర్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 9,200ల బస్సులు

పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టడంతో పాటు పెరిగిన రద్దీకి తగ్గట్లు అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్‌లు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కొత్త బస్సులు వస్తున్నా, మొత్తం బస్సులతో పోలిస్తే వాటి సంఖ్య అరకొరగా మాత్రమే ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు. ఆర్టీసిలో రాష్ట్రవ్యాప్తంగా (అద్దె బస్సులతో) కలిపి 9,200 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఐదు వేల బస్సులకు పైగా పాతవి ఉన్నాయి. అద్దె బస్సులను ఒప్పందం ముగిశాక పక్కన పెడుతున్న ఆర్టీసి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సొంత బస్సులను మాత్రం ఆర్టీసి తీసుకురాలేకపోతుంది.

అతి కష్టం మీద రూ.1000 కోట్ల రుణం

ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న ఆర్టీసి అతి కష్టం మీద రూ.1000 కోట్ల రుణాల్ని తీసుకుంది. గతంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగినా, నేరుగా వచ్చే ఆదాయం రూ.450 కోట్ల నుంచి రూ.270 కోట్లకు తగ్గినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం ‘జీరో’ టికెట్ల కింద ఆర్టీసికి నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అప్పు ఇచ్చే బ్యాంకులు మాత్రం ఆర్టీసికి ప్రయాణికుల నుంచి నేరుగా వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా సమాచారం.

బస్సుల బ్రేక్ సిస్టమ్ సక్రమంగా చేయాలని సర్క్యులర్

బస్సుల బ్రేక్ సిస్టమ్ నిర్వహణ సక్రమంగా చేయాలంటూ ఆర్టీసి యాజమాన్యం అధికారులకు ఇటీవల ఓ సర్క్యులర్ ఇచ్చింది. నిర్వహణ నిర్లక్ష్యం కారణంగా కొన్ని డిపోల్లో జరిగిన ప్రమాదాల దృష్టా వెంటనే చర్యలు చేపట్టాలని అందులో పేర్కొంది. బ్రేక్ లైనర్ల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను ఆ సర్క్యులర్లో స్పష్టంగా వివరణ ఇచ్చింది. ప్రమాదాల నిర్వహణ, ఆపద సమయంలో ఎలా స్పందించాలన్న విషయంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చిన యాజమాన్యం అసలు తుక్కుగా మారుతున్న బస్సుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది తెలుపకపోవడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular