జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో అమాయకులైన 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రమూకలకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న దాయాది పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేశారు. దీంతో భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాదులపై విరుచుకుపడింది. పీఓకేతో పాటు పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేపట్టింది. కీలకమైన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది.
భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ… ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు.
తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ‘ఆపరేషన్ సిందూర్’పై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆయన పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తని చంపి.. వెళ్లి మోదీకి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది అంటూ ఆర్‌జీవీ సెటైరికల్‌గా ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఏది ఏమైనప్పటికీ ఎవ్వరైనా కోరుకునేది శాంతిభద్రతలు మాత్రమే.