రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోటలో ఓ యువకుడిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో అమ్మాయి తండ్రే కిరాతకంగా హతమార్చాడు. పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా.. అకస్మాత్తుగా గొడ్డలితో దాడి చేసి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
రెండేళ్ల నుంచి తమ కుమారుడు వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారని సాయికుమార్ తండ్రి చెబుతున్నాడు. ఈ కారణంతో తన కుమారుడిని హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సాయి కేక్ కట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన అమ్మాయి తండ్రి సాయిపై గొడ్డలితో వేటు వేశాడు. మొదట సాయి మెడపై అమ్మాయి తండ్రి వేటు వేయగా.. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడిని నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెత్తాడు. అయినప్పటికీ అతడిని వదలలేదు.
సాయి కుమార్‌ను కాపాడటానికి స్నేహితులు కూడా వెనకే పరిగెత్తారు. కానీ బొడ్రాయి దగ్గర మళ్లీ వరుసగా సాయిపై గొడ్డలి పోట్లు పడ్డాయి. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సాయిని నరికిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నంలోపు నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రేమించిన కారణంగా యువకుడు ఇలా దారుణ హత్యకు గురవడం జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.