జమ్ము కాశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాకిస్థాన్- భారత్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసిగా భారత్ ఉంది. ఈ క్రమంలో భారత్.. ఎప్పుడు, ఎక్కడ.. ఏ సమయంలో దాడి చేస్తుందోనని పాకిస్థాన్ భయంతో ఉంది. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి గురించి మొత్తం సమాచారం అమెరికాకు ముందే తెలుసని అన్నారు. అమెరికా నిఘా వర్గాల వద్ద ఈ దాడికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఉందని తెలిపారు. అయినా ఎందుకు ముందే చెప్పలేదని అమెరికాపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గతంలో తాను ప్రధాని మోదీ, వైట్‌హౌస్ అనుమతితో పాకిస్థాన్ వెళ్లి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదుర్చుతానని పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పహల్గాం ఘటనపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో గల ప్రధాని అధికారిక నివాసం నంబర్ 7.. లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఈ భేటీ జరిగింది. దాదాపుగా గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాలతో సమావేశం అయ్యారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.