పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని భారత ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపింది. సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అలాగే పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కు ప్రతిపాదనలు కూడా పంపింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే తామేమీ తక్కువ కాదని పాకిస్థాన్ సైతం భారత్ పై పలు ఆంక్షలు విధించింది. అలా పాకిస్థాన్ గగనతలంను మూసివేసింది. దీంతో భారత్ లోని వైమానిక సంస్థ ఎయిర్ ఇండియాకు సుమారు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తన్నారు. ఏడాది పాటు పాకిస్థాన్ గగనతలం ఇలానే మూసివేస్తే.. భారత్ కు రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ నిర్ణయంతో ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించేవాళ్లు ఇకపై పాకిస్థాన్ గగనతలం నుంచి ప్రయాణించేందుకు వీలు లేదు. ఈ నిర్ణయం ఎప్పటివరకు అమల్లో ఉంటుందో తెలియదు.