సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత బలగాలు
వరుసగా రెండో రోజు భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.
వరుసగా రెండో రోజు భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్.. తాజాగా జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ సెక్టార్లలో డ్రోన్లతో దాడికి యత్నిస్తోంది. ఇక పాకిస్తాన్ డ్రోన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
యురి సెక్టార్‌లో మరోసారి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎల్‌వోసీ వెంబడి కాల్పులు, భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నట్లు సమాచారం. సరిహద్దుల వెంబడి సైరన్లు మోగించారు. జమ్మూ, అక్నూర్, జైసల్మేర్, అంబాలా, పంచుకులలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ పాటిస్తున్నారు.
తాను ఉన్న చోట నుండి అడపాదడపా పేలుళ్ల శబ్దాలు వినబడుతున్నాయి అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుతో పాటు చీకట్లో ఉన్న నగరానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. ఇప్పుడు జమ్మూలో బ్లాక్‌అవుట్. నగరం అంతటా సైరన్‌లు వినబడుతున్నాయి అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. జమ్మూతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి, దయచేసి వీధులకు దూరంగా ఉండండి, ఇంట్లో లేదా రాబోయే కొన్ని గంటలు మీరు హాయిగా ఉండగలిగే దగ్గరి ప్రదేశంలో ఉండండి. పుకార్లను నమ్మకండి, ఆధారాలు లేని లేదా ధృవీకరించని కథనాలను వ్యాప్తి చేయవద్దు అని ప్రజలకు సీఎం సూచించారు.