- కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే సహకరించారు..
- కేసీఆర్ పాపం నేడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది..
- నీళ్లు రాయలసీమకు.. నిధులు కెసిఆర్ కుటుంబానికి..
- మేం ప్రజలకు మంచి చేస్తుంటే వీళ్లు కాకుల్లా పొడుస్తున్నారు.
- నారాయణపేటలో ‘‘ప్రజా పాలన- ప్రగతి బాట’’ బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గత పదేళ్ల బిఆర్ ఎస్ పాలనతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కెసీఆర్ పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌కు పదేళ్లు అవకాశమిచ్చారని.. ఆ పదేళ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే.. నేడు ఆంధ్రప్రదేశ్‌లో గొడవ ఉండేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వొచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టామని పేర్కొన్నారు. నారాయణపేట్ గురుకుల హాస్టల్ ఆవరణలో ‘‘ప్రజా పాలన- ప్రగతి బాట’’బహిరంగ సభ జరిగింది.
రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వసలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులతోపాటు. సభకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. నారాయణపేట ‘‘ప్రజా పాలన- ప్రగతి బాట’’బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పదేళ్లుగా పాలమూరు జిల్లాకు ఎందుకు నీళ్లు రాలేదు.. పాలమూరులో ఎందుకు పాడి పంటలు కనిపించలేదు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను కెసిఆర్ ఎందుకు పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి కెసీఆర్ పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతి తెస్తే నా పై కోపంతో దాన్ని పడావు పెట్టారు. పాలమూరు వలసలు ఆపేందుకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నమేం ప్రయత్నిస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు.
ఆనాడు వైఎస్ కు ఊడిగం చేసి కృష్ణా జలాలు సీమకు తరలించుకుపోయేందుకు సహకరించింది కెసిఆరే.. జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. ఆయన చేసిన పాపం ఇవాళ రాష్ట్రాన్ని వెంటాడుతున్నదని మండిపడ్డారు . పదేళ్లలో సాగునీటి మంత్రులుగా ఉన్నది హరీష్, కెసిఆరేనని, ఈ పాపం మీది కాకాపోతే ఇంకెవరిది అని ప్రశ్నించారు. నీళ్లు రాయలసీమ తరలించుకుపోతే.. నిధులు కెసిఆర్ కుటుంబం తరలించుకుపోయిందన్నారు. పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై, 12 నెలల మా పాలనపై చర్చకు మేం సిద్ధమని రెండు పార్టీలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి బీఆరెస్ నుంచి కెసిఆర్ వస్తారో కొడుకును, అల్లుడిని పంపిస్తారో రండి అని అన్నారు. ప్లేస్, డేట్ చెప్పండి చర్చకు నేను సిద్ధం. కెసిఆర్ నువ్వు గట్టిగా కొట్టాలంటే నీ కొడుకును, నీ బిడ్డను, నీ అల్లుడిని కొట్టుకో కాంగ్రెస్ ను కొడతామంటే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తానంటే నిన్ను ఎవరైనా వద్దన్నారా? పన్నెండు నెలల్లో మేం ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు.
మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు అప్పగించి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఆర్టీసీలో మహిళకు 600 బస్సులను అప్పగించి వారిని ఓనర్లను చేశాం. రూ.5వేల కోట్లతో కొడంగల్, వెయ్యి కోట్లతో నారాయణపేట అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం. ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. బీఆర్‌ఎస్ కు సూటిగా సవాల్ విసురుతున్నా. ఏ ఊర్లో మేం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో ఆ ఊర్లో మేం పోటీ చేస్తాం. ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో అక్కడే మీరు పోటీచేయాలి అని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులగణన నిర్వహించాం . ముప్ఫై ఏళ్లుగా పరిష్కారం కానీ ఎస్సీ ఉపకులాల సమస్యకు పరిష్కారం చూపాం. ఇవన్నీ కెసిఆర్ కళ్లకు కనిపించడంలేదా? నల్లడబ్బు పేదల ఖాతాలో వేస్తామన్న మోదీ ఏం చేశారు? రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని వారిని మోసం చేశారు. 2022 లోగా ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చారో చెప్పండి. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలుఇస్తామన్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి తప్ప తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేసినా తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ కాకుల్లా పొడుస్తున్నారు. కాకుల్లా పొడిచే వీళ్లకు సరైన జవాబు చెప్పే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే.. పాలమూరు పచ్చగా కనబడితే వాళ్ల కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లు కండల్లో నిప్పులు పోసుకుంటున్నారు వాళ్ళ కడుపులు మండుతున్నాయ్ మీరు బాధపడొద్దు కన్నీరు పెట్టుకోవద్దు.. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకుందాం. నష్టపరిహారం ఇచ్చి ఉద్దండాపూర్ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని బయలుదేరి మనపై కుట్రలు చేస్తున్నారని, వారికి మీరు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. పనులు చేసే బాధ్యత నాది తనను కాపాడుకునే బాధ్యత మీదేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.