కాంగ్రెస్ ఎంపి మల్లు రవి డిమాండ్
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ చేసిన తప్పులన్నీ ఒప్పుకొని కాళేశ్వరం విజిట్ చేయడం వెంటనే ఆపాలని ఆయన అన్నారు. అసలు బిఆర్‌ఎస్ నాయకులు కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో జనాలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వంలో జరిగిన తప్పులను, వాస్తవాలను శ్వేతపత్రంలో ప్రజల ముందు ఉంచామన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జరిగింది చిన్న పొరపాటు కాదని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం కట్టి నష్టపరిస్తే పాలమూరు రంగారెడ్డిని కట్టకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని మల్లు రవి విమర్శలు గుప్పించారు.
సిఎం ఆలోచనను స్వాగతిస్తున్నాం
రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలన్న సిఎం ఆలోచనను స్వాగతిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టీచర్లు లేరని గత ప్రభుత్వం పాఠశాలలను మూసేసిందని ఆయన గుర్తు చేశారు. మూసేసిన పాఠశాలలను మళ్లీ తెరుస్తామన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లను రద్దు చేస్తామని సిఎం హామీ ఇచ్చారన్నారు. రూ.2 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్లు , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని సౌకర్యాలను కల్పించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచుతామన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా సమస్యల మీద పార్లమెంట్‌లో కొట్లాడతామన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. బడి బాట కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సిఎం రేవంత్ సూచించారని ఆయన తెలిపారు.