ఢిల్లీ నుంచి లక్నో వెళుతున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానం లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.10 గంటలకు ల్యాండ్ అయింది. ప్రయాణికులు అందరూ దిగుతుండగా… ఓ వ్యక్తి మాత్రం ఉలుకుపలుకూ లేకుండా సీటులోనే కూర్చొని ఉండటాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించింది. వెంటనే విమానంలో ఉన్న ఓ వైద్యుడు ఆ వ్యక్తిని పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. దాంతో సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడిని ఢిల్లీకి చెందిన ఆసిఫ్ ఉల్హా అన్సారీగా అధికారులు గుర్తించారు. విమానం ఎక్కిన తర్వాత అతడికి ఇచ్చిన ఆహార పదార్థాలు అలాగే ఉండడం, సీటు బెల్టు కూడా తీయకపోవడంతో ఫ్లైట్ గాల్లో ఉండగానే ఆసిఫ్ చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించిన అధికారులు… అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్లు తెలిపారు.