డిప్యూటీ సీఎం హోదాలో పవన్, నిర్మాతగా సుప్రియ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తొలి హీరోయిన్ ను కలిశారు. పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో మొదటిసారి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా సుప్రియ నటించారు. ఆ తరువాత వీళ్లిద్దరు కలిసి నటించలేదు. ఇదిగో ఇన్నాళ్లకు మళ్లీ పవన్ కళ్యాణ్, సుప్రియా కలవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వీళ్లిద్దరు ఎక్కడ కలిశారనే కదా మీ సందేహం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాతలు ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతగా ఉన్న సుప్రియ కూడా భేటీలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తరువాత నిర్మాతలంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఫొటోలు దిగారు. 28 సంవత్సరాల క్రితం 1996 లో హీరో హీరోయిన్లుగా నటించిన పవన్ కళ్యాణ్, సుప్రియ ఇప్పుడు కలవడం, అది కూడా పవన్ డిప్యూటీ సీఎంగా, సుప్రియ నిర్మాతగా ఇన్నేళ్ల తరువాత ఇద్దరూ కలిసి ఫోటో దిగడం విశేషం.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, డి.సురేశ్ బాబు, దిల్ రాజు, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, ఎన్వీ ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, నాగవంశీ, బన్ని వాసు, రవిశంకర్, నవీన్ యర్నేని తదితరులు ఉన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, ఆంధ్రప్రదేశ్ లో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర అంశాలపై పవన్ తో చర్చించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్, సుప్రియ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.