ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్ సూర్యారాధన చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు సైతం పాల్గొన్నారు.
ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ గురువారం సూర్యారాధనలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులైన పవన్ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు వేద పండితులు సూర్యుని విశిష్ఠతను తెలియజేశారు. ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని పండితులు చెప్పుకొచ్చారు. వనవాసంలో ఉన్నప్పుడు పాండవ అగ్రజుడు ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోందని వివరించారు.
కాల క్రమేనా బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు రోజుగా మారిపోయిందని, కానీ మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందని చెప్పారు వేద పండితులు.