బిఆర్‌ఎస్ హయాంలో అధికార దుర్వినియోగం చేసిన వారి కోసం
త్వరలోనే రెడ్ బుక్‌ను ఓపెన్ చేస్తా
దుబాయ్, సింగపూర్ కేంద్రంగా బిఆర్‌ఎస్ సోషల్‌మీడియా నడుస్తోంది
సామాజిక మాధ్యమాల్లో కావాలనే ప్రభుత్వంపై
బురద జల్లుతున్నారు
హైడ్రా ద్వారా చెరువులు, కుంటల
ఆక్రమణ దారులకు భయం పుట్టేలా చేశాం
బిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ హయాంలోనూ
మూసీ ఆక్రమణలు జరిగాయి
త్వరలోనే జీవన్‌రెడ్డి కోపం చల్లారుతుంది
తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు ఉండదు
విలేకరులతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్‌చాట్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలపై తాను కూడా వేచి చూస్తున్నానని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరగాలని తాను కోరుకుంటున్నాని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలోనే రెడ్ బుక్‌ను ఓపెన్ చేస్తామని, బిఆర్‌ఎస్ హయాంలో అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం చిమ్మేందుకు సోషల్ మీడియాపై భారీగా ఖర్చు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాను దుబాయ్, సింగపూర్ కేంద్రంగా వారు నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. బయటి దేశాల నుంచి సోషల్ మీడియా హ్యాండిల్ నడిపించడంతో పోలీసులకు దొరకడం లేదని ఇబ్బంది అవుతుందని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కావాలనే తమపై బురద జల్లుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. తమ సోషల్ మీడియా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుందని ఆయన తెలిపారు. గురువారం విలేకరులతో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్‌చాట్ చేశారు.
10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు ప్రభుత్వం చేస్తున్న మంచిపనులపై ప్రజల మనసుల్లో అపనమ్మకాలను పెంచుతున్నారన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడకుండా వాస్తవాలను గ్రహించాలని ఆయన సూచించారు. బిఆర్‌ఎస్ 10 ఏళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇస్తే తాము కేవలం 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన తెలియజేశారు. తమ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే పేదలు, రైతులు, మహిళల కోసం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేశామని ఆయన పేర్కొన్నారు.
హైడ్రా ద్వారా చెరువులు, కుంటల ఆక్రమణ దారులకు భయం పుట్టేలా చేశామని హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు ఆక్రమించి వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లకుండా చేసి చిన్న వర్షాలకే నగరం జలమయం అయ్యేలా చేస్తే బాగుంటుందా అని ఆయన ప్రశ్నించారు. మూసీనది ప్రక్షాళనతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా జీవించేలా చేస్తామని, మూసీ నదికి పర్యాటక శోభ తెస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌తో పాటు తమ కాంగ్రెస్ హయాంలో కూడా కొంత ఆక్రమణలు జరిగాయన్నారు. బిజెపి నాయకులు మూసీ చుట్టూ తిరుగుతున్నారని, వాళ్లకు అక్కడ ఏమీ జరుగుతుందో అర్థం అవుతుందని ఆయన తెలిపారు. నిజాయితీగా బిజెపి నాయకులు మూసీ పర్యటన చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. కాళేశ్వరం లక్ష కోట్లు ఏమయ్యాయని, మూసీకి అంత అవుతాయని ఎందుకు అనుకుంటున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినా తప్పే, ఇన్‌ఛార్జీ హైదరాబాద్‌లో ఉన్న తప్పేనా…?
ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటున్నారని, ఆమె సమయం ఇవ్వక పోతే ఇవ్వలేదని, ఇస్తే ఆమెపై తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. కొందరు పని కట్టుకొని ఆమెపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినా తప్పే, ఇన్‌ఛార్జీ హైదరాబాద్‌లో ఉన్న తప్పేనా అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు జీవన్ రెడ్డి వ్యతిరేకించారని ఆయన తెలిపారు. జీవన్‌రెడ్డి బాధలో ఉన్నారని, ఆ బాధలో ఆయన ఏదో మాట్లాడుతున్నారని, జగిత్యాలకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబు నివేదిక పార్టీకి అందచేస్తారని ఆ తరువాతే తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. జీవన్ రెడ్డికి కోపం త్వరలోనే తగ్గుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బిఆర్‌ఎస్ నేతలు ప్రచార చేయడంతో బిఆర్‌ఎస్‌లోని కొంతమంది ఎమ్మెల్యేలు మకు సపోర్ట్ చేశారని ఆయన తెలిపారు. తమకు అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు కాకుండా 80 సీట్లు వస్తే బాగుండేదని, చేరికలపై ఒక్కోక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు ఉండదని, జగిత్యాల హత్య కేసుకు సంబంధించి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. పాత, కొత్త నేతలను కలుపుకుని ఇందిరమ్మ కమిటీలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. రెండు నామినేటెడ్ పదవులు ఏ ఒక్కరికీ ఇచ్చే అవకాశం లేదని ఆయన తెలిపారు.