- ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తయ్యింది
- ప్రజలిచ్చిన తీర్పును బిఆర్‌ఎస్ ఎందుకు గౌరవించడం లేదు
- పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనవద్దని, కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని, రేవంత్ రెడ్డిని సిఎం చేశారని, రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత లోపాలను సవరించుకుంటూ ఎనిమిది నెలలుగా పాలన సాగిస్తున్నామని ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తయ్యిందని ఆయన తెలిపారు. కెసిఆర్, కెటిఆర్‌లు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారని, ప్రజలిచ్చిన తీర్పును ఎందుకు గౌరవించడం లేదని, బిఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికలు వస్తాయని కెటిఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఉప ఎన్నికల మత్తులో బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నేతలకు ఒక్కసీటు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. మెదక్ సొంత జిల్లా అనే ట్రబుల్ షూటర్ హరీష్ రావు మెదక్ ఎంపి ఎందుకు గెలవలేదని ఆయన ప్రశ్నించారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో మూడో స్థానానికి బిఆర్‌ఎస్ పడిపోయిందన్నారు.
పనులు అవుతాయని లోకల్ బాడీ లీడర్లు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీరు కూడా గతంలో బిఆర్‌ఎస్‌లో జాయిన్ చేసుకున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ పాలనలో ప్రజా పాలన సాగిందా, ఫాంహౌస్, ప్రగతి భవన్ నుంచి పాలన సాగిందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేశామని, అధికారంలో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని, ఇది కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన అన్నారు.