Monday, March 31, 2025

వీరికి రూల్స్ అడ్డురావు…?

  • 6వ జోన్‌లో పాతుకుపోయిన అధికారులు..!
  • 5వ జోన్ వద్దు…6వ జోన్ ముద్దంటున్న ఎక్పైజ్ అధికారులు
  • ఈ అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసిన ఫార్మా, స్పిరిట్ కంపెనీలు
  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ఫార్మా, స్పిరిట్, డిస్టలరీ, బ్రేవరేజస్ కంపెనీల లైసెన్స్‌లను రెన్యువల్ చేసే పోస్టుల్లో పనిచేసిన కొందరు ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. 20 నుంచి 25 ఏళ్లుగా వారు ఆదాయం వచ్చే చోటనే పనిచేస్తున్నారు. తమకు కేటాయించిన ఐదో జోన్‌లో పనిచేయకుండా ఫైరవీలతో ఆరోజోన్‌లో పోస్టింగ్ వేయించుకొని ఇక్కడే పాతుకుపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతికి అలవాటుపడ్డ ఈ అధికారుల తీరు మారకపోవడంతో విసుగుచెందిన కొన్ని ఫార్మా, స్పిరిట్ కంపెనీల యాజమాన్యాలు ప్రస్తుతం ఆ అధికారుల అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ ఫిర్యాదులో ఏయే అధికారికి ఎంత లంచాలు ఇచ్చామన్న విషయాన్ని కొన్ని కంపెనీలు లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణ జరపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రానున్న రోజుల్లో డిప్యూటేషన్‌లపై పారదర్శకంగా వ్యవహారించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.
20 నుంచి 25 ఏళ్లుగా ఆరో జోన్‌లోనే తిష్ట
5వ జోన్‌కు కేటాయించబడిన పలువురు అధికారులు 20 నుంచి 25 ఏళ్లుగా ఆరో జోన్‌లోనే తిష్టవేయడం, పదోన్నతులు వచ్చినా ఆ అవినీతి దందాను వదలకపోవడంతో ఆయా కంపెనీల యజామాన్యాలు ప్రస్తుతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇలా అవినీతికి అలవాటు పడ్డ అధికారులు మంత్రులు, ఉన్నతాధికారులతో ఫైరవీలు చేసుకుంటూ వారికి నచ్చిన చోట (ఆరో జోన్‌లో) ఇన్నేళ్లుగా విధులను నిర్వర్తిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు సైతం ఆరోపించడం విశేషం.
ఎస్టీఎఫ్, డిస్టలరీ, డిడిపి (వింగ్), బ్రేవరేజస్‌లలో విధులు
ఈ అధికారులంతా తమకు కేటాయించిన జోన్‌లో కాకుండా ఆరో జోన్‌లో ఉన్న ఎస్టీఎఫ్, డిస్టలరీ, డిడిపి (వింగ్), బ్రేవరేజస్‌లలో విధులను నిర్వహించడానికి ఇన్నేళ్లు ఆసక్తి చూపారు. అయితే ఈ అధికారులు 20 నుంచి 25 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయి కోట్ల రూపాయలను వెనుకేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు స్పిరిట్, ఫార్మా కంపెనీలకు సంబంధించి లైసెన్స్‌లను రెన్యువల్ చేసి కోట్ల రూపాయలను ఆర్జించగా, ఈ లైసెన్స్‌లను రెన్యువల్ చేసే క్రమంలో ఒక్కో కంపెనీ నుంచి కోట్ల ముడుపులను తీసుకున్నట్టుగా ప్రస్తుతం ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
ప్రస్తుతం ఏఈఎస్‌గా పదోన్నతి
ఈ అధికారి 20 ఏళ్లుగా ఆరో జోన్‌లో పనిచేస్తుండగా ప్రస్తుతం ఆయనకు ఏఈఎస్‌గా పదోన్నతి లభించింది. ఆయన గతంలో ఈఓగా పటాన్‌చెరు, చార్మినార్, ఎస్టీఎఫ్, యూబి నాచారంలో పనిచేసి కోట్ల రూపాయలను వెనుకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య ప్రస్తుతం ఓ పార్టీ మున్సిపల్ చైర్మన్‌గా కావడంతో గత ప్రభుత్వ హయాంలో ఈ అధికారి పలు కంపెనీలను బెదిరించి డబ్బులను వసూలు చేసినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినట్టుగా సమాచారం. దీంతోపాటు ఆయన గత 10 సంవత్సరాల్లో ఏ అధికారి మాట కూడా ఆయన లెక్కచేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పదవీ విరమణలోపు కోట్లు దండుకొని….
ఈ అధికారి 25 సంవత్సరాల పాటు ఆరో జోన్‌లోని డిస్టలరీ వింగ్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన సిఐగా రిటైర్డ్ అయ్యారు. మరో అధికారి సిఐగా 20 ఏళ్లు ఆరో జోన్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరిద్దరూ తమ సర్వీసును 5వ జోన్‌లో కాకుండా ఆరోజోన్‌లోనే విధులను నిర్వర్తించడంతో పాటు తమకు నచ్చిన పోస్టింగ్ కోసం ఫైరవీలు చేసుకొని కోట్ల రూపాయలను దండుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కంపెనీల వద్దకు ఈ అధికారి ఒక్కరే వెళ్లి….
ప్రస్తుతం ఈ అధికారి ఏఈఎస్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన చార్మినార్, పటాన్‌చెరు, జీడిమెట్ల, డిడిపి (వింగ్)లో క్రౌన్ బ్రేవరేజేస్‌లో పనిచేశారు. ఆయన 25 ఏళ్ల పాటు ఆరో జోన్‌లో పనిచేశారు. ఎస్టీఎఫ్‌లో 6 ఏళ్లు, చార్మినార్, బాలానగర్, డిడిపి (వింగ్)లో ఆయన పనిచేసి కోట్లు వెనుకేసున్నారని, ఆయన లెసెన్స్‌ల రెన్యువల్ సందర్భంలో ఒక్కరే ఆయా కంపెనీల వద్దకు వెళ్లి మాముళ్లు తీసుకునేవారని, ఆయన ఆగడాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా అప్పట్లో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని వారికి అమ్యామ్యాలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీరిద్దరికీ గత ప్రభుత్వంలోని…..
ఈ ఇద్దరూ అధికారులు ప్రస్తుతం ఆరో జోన్‌లో సిఐలు పనిచేస్తుండగా వీరి సర్వీసు మొత్తం ఈ జోన్‌లో జరగడం విశేషం. వీరిద్దరూ ఈఓలుగా కొన్ని సంవత్సరాలుగా చార్మినార్, పటాన్‌చెరు తదితర చోట్ల పనిచేసి కోట్ల రూపాయలను వెనకేసుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిది కూడా 5వ జోన్ కాగా, వీరిలో ఒకరికి గత ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యేతో సంబంధం ఉండగా మరో సిఐకి ఉద్యోగ సంఘాలతో పాటు గత ప్రభుత్వంలోని మంత్రులతో మంచి సంబంధాలు ఉండడం వల్లే ఆయన ఇన్ని రోజులు ఈ జోన్‌లో పనిచేశారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఎస్టీఎఫ్‌లో పనిచేసి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని
ఈ అధికారి 25 ఏళ్ల పాటు ఆరో జోన్‌లో పనిచేయడంతో పాటు ఈఓ పటాన్‌చెరు, చార్మినార్, డిడిపి (వింగ్), ఏఈఎస్ డిస్టలరీ వింగ్‌లోనే విధులు నిర్వహించి అందినకాడికి దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో అధికారి ప్రస్తుతం ఏఈఎస్‌గా ఆరో జోన్‌లో పనిచేస్తుండగా గతంలో ఈఓ చార్మినార్, బాలానగర్, జీడిమెట్ల, ఎస్టీఎఫ్‌లో పనిచేసి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని తాను అనుకున్న విధంగా ఇక్కడే పనిచేయడం విశేషం. ప్రస్తుతం మరో అధికారిణి తాండూరులో పనిచేస్తుండగా గతంలో ఆమె ఈఓ పటాన్‌చెరు, నాచారం, తదితర ప్రాంతాల్లో పనిచేసింది. ప్రస్తుతం ఆమెపై కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కొందరు అధికారులు రూల్స్‌కు విరుద్ధంగా పనిచేయాల్సిన జోన్‌లో కాకుండా వేరే జోన్‌లో పనిచేయడానికి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని అందినకాడికి దండుకోవడంతో, వారికి లంచాలు ఇచ్చిన కంపెనీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com