ఎందరికో కొరుకుడుపడని ఆర్గానిక్ కెమిస్ట్రీలో అతడు ఏకంగా పీహెచ్డీ చేశాడు. ఎంతో కష్టపడి చదివిన విజ్ఞానంతో సమాజానికి మేలు చేయడం బదులు అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. బావమరిదితో కలిసి ప్రజలను మత్తులో ముంచుతూ రూ.కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకున్నాడు. హైదరాబాద్‌లో అల్ఫ్రాజోలం తయారు చేస్తూ నాలుగైదు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. దీంతో సంపాదించిన రూ.30 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్‌శాండిల్య సోమవారం తెలిపారు. ఈ డ్రగ్ రాకెట్‌ను టీజీన్యాబ్ ఎస్పీ సాయిచైతన్య బృందం ఛేదించిందని, మాదాపూర్ పోలీసుల సహకారంతో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన లింగయ్య గౌడ్ ఓయూలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశాడు.
కొన్ని కల్లు కౌంపౌండ్లలో నిషేధిత మాదక ద్రవ్యాలను వాడుతున్నట్లు గమనించాడు. కల్లులో కలిపేందుకు వాటిని అధిక ధరలకు కొంటున్నట్లు గుర్తించాడు. తనకున్న విజ్ఞానంతో అల్ఫ్రాజోలం తయారు చేయడానికి ఏడేళ్ల క్రితం మెదక్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మూతపడిన పరిశ్రమలను అద్దెకు తీసుకున్నాడు. అల్ఫ్రాజోలాన్ని కొద్దికొద్దిగా తయారు చేస్తూ గుట్టుగా విక్రయించేవాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసే తన బావమరిది రామకృష్ణ గౌడ్ ద్వారా విజయవాడ పారిశ్రామికవాడలో పరమేశ్వర కెమికల్స్, ఎనలిటికల్ ల్యాబ్ ఎండీ మునగాల కిరణ్‌కుమార్ పరిచయమయ్యాడు. ముగ్గురూ కలిసి 2021 మార్చిలో విజయవాడలోనే భారీగా అల్ఫ్రాజోలం తయారీ ప్రారంభించారు.
అదే సంవత్సరంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొని వస్తుండగా పేట్ బషీర్‌బాద్ పోలీసులకు చిక్కారు. అప్పట్లోనే విజయవాడలోని యూనిట్‌ను పోలీసులు సీజ్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అదే యూనిట్‌లో గుట్టుగా డ్రగ్ తయారీ చేపట్టారు. ఈసారి కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో ఇల్లు అద్దెకు తీసుకొని మరో బావమరిది నరేందర్ గౌడ్‌తో కలిసి దందా ప్రారంభించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అల్ఫ్రాజోలం కొనుగోలు చేసే దళారులు, ఏజెంట్లతో లింగయ్య గౌడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. వారికి కిలో రూ.3 లక్షలకు విక్రయించే వాడు. దళారులు కల్లు కాంపౌండ్లకు కిలో రూ.5-8 లక్షల వరకు అమ్మేవారు.
రూ.30 కోట్ల ఆస్తులు జప్తు
గతేడాది మార్చిలో మాదాపూర్ పోలీసులు, టీజీన్యాబ్ కలిసి లింగయ్య గౌడ్‌ను అరెస్ట్ చేశారు. విజయవాడలోని ల్యాబ్‌ను మూసివేశారు. దర్యాప్తులో అతను హైదరాబాద్ చుట్టుపక్కల రూ.30 కోట్ల విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించి వాటిని జప్తు చేశారు. అతని ముఠాలోని నలుగురు సభ్యులకు చెందిన రూ.33 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేశారు.