Friday, January 31, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. ఈ కేసులో తాజాగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌, మూడో నిందితుడుగా ఉన్న భుజంగరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిందితులు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అదేవిధంగా పాస్​పోర్టులు సమర్పించాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాజాగా రాధాకిషన్, భుజంగరావుకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో ఉన్న ప్రణీత్ రావు మత్రమే ప్రస్తుతం జైలులో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరైంది.

ఈ నెల 28న తిరుపతన్నకు కూడా బెయిల్​
ఈ కేసులో సస్పెండైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు ఈ నెల 28న బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న తిరుపతన్నను గతేడాది మార్చి 23న సిట్‌‌ అరెస్ట్‌‌ చేసింది. దీంతో 10 నెలలపాటు జైలు జీవితం గడిపిన తిరుపతన్న బెయిల్​పై విడుదలయ్యారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించి విడుదల కావడం గమనార్హం. సుప్రీం ఆదేశాల మేరకు ఆయన లాయర్లు మంగళవారం నాంపల్లి కోర్టులో ష్యూరిటీస్‌‌ దాఖలు చేశారు. అనంతరం బెయిల్‌‌ ఆర్డర్‌‌‌‌ను చంచల్‌‌గూడ జైలు అధికారులకు అందించారు.

ప్రణీత్‌‌రావుకు నో బెయిల్​
ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో ప్రధా నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌రావుకు మాత్రం బెయిల్‌‌ లభించలేదు. రెండో నిందితుడిగా ఉన్న ప్రణీత్‌‌రావు ప్రస్తుతం చంచల్​గూడ జైలులోనే ఉన్నారు. ఆయన తరఫు లాయర్లు సమర్పించిన బెయిల్​ పిటిషన్లను హైకోర్టు పలుమార్లు తిరస్కరించింది.

ప్రభాకర్‌‌‌‌రావు, శ్రవణ్‌‌రావును అమెరికా నుంచి రప్పించే యత్నం
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌‌రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రభాకర్‌‌‌‌రావు, శ్రవణ్‌‌రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హైదరాబాద్‌‌లోని అమెరికన్ ఎంబసీ ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.

450కి పైగా ఫోన్ల ట్యాప్‌‌
ఫోన్​ ట్యాపింగ్ కేసులో రెండో చార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేసేందుకు సిట్ దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 నవంబర్‌‌‌‌ 15 నుంచి 30వ తేదీ మధ్య 450కి పైగా ఫోన్లను ట్యాప్‌‌ చేసినట్టు సిట్‌‌ సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇందులో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన రెండు ఫోన్ నంబర్స్‌‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుల ఫోన్‌‌ నంబర్స్‌‌, మండలస్థాయి కాంగ్రెస్​ లీడర్ల నంబర్లు కూడా ఉన్నట్టు గుర్తించారు.

ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా..
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇటీవలే వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక నిందితుడి సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఫోన్లలో ఇద్దరు న్యాయమూర్తుల ఫొటోలతో పాటు వారి పూర్తి ప్రొఫైల్స్ ఉన్నాయి. వారు ఎక్కడ జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు? కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగ ప్రస్థానం వంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. వారి నంబర్ల కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్)తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్)ను కూడా నిందితుడు సేకరించినట్లు గుర్తించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com