ప్రభుత్వం పెడుతున్న తిండి ఇంత దారుణంగా ఉంటుందా..?. పిల్లల ప్రాణాలు అంటే లెక్కలేదా.. ఇంత జరుగుతుంటే మరి మీరేం చేస్తున్నారు.. ఏసీల కింద చల్లగా నిద్రపోతున్నారా..? అంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు.. అధికారుల తీరుపై మండిపడింది. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించింది. వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది.
మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అంశమని సీజే జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. పిల్లలు చనిపోతే గానీ స్పందించరా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని.. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ తలంటింది. ఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలుపగా.. కౌంటర్ దాఖలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల సేకరణకు వారం సమయం ఎందుకని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పని చేస్తారా? అని నిలదీసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని హైకోర్టు చెప్పింది. అధికారులకు కూడా పిలున్నారని.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. ఘటనపై భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు అందజేస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తరుచూ భోజనం వికటిస్తుందని ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నారాయణపేట జిల్లా మానగూరు జడ్పీ పాఠశాలలో మంగళవారం ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడగా.. వెంటనే వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో వారం వ్యవధిలోనే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఇంతకు ముందు 20న ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలోనూ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో చౌదరి శైలజ అనే విద్యార్థి పరిస్థితి విషమించి.. చివరకు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే. శైలజకు అక్టోబర్ 30న పాఠశాలలో వాంతులు విరేచనాలు కావడంతో వాంకిడి వైద్యశాలలో చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి విష మించడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసి మెరుగైనవైద్యం కోసం హైదరాబా ద్‌లోని నిమ్స్‌కు తరలించారు. దాదాపు 20 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సపొందిన విద్యార్థిని గత సోమవారం తుదిశ్వాస విడిచింది.
మక్తల్‌లో పోలీసుల అత్యుత్సాహం
మక్తల్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శనకు వెళ్తారనే అనుమానంతో బుధవారం తెల్లవారు జామున మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నియోజకవర్గవ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన నేతలను అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మద్దూర్ పోలీస్ స్టేషన్‌కు నారాయణపేట పోలీసులు తరలించారు. మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్‌తో విద్యార్థులు అవస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన నిర్వహించే అవకాశం ఉందనే అనుమానంతో బుధవారం తెల్లవారు నుంచే పోలీసులు అరెస్టులకు దిగారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మాగనూరులో నిరసనలు, ఆందోళనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్‌ఎస్ నేతలు మక్తల్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి.. ఠాణాకు తరలించారు. పోలీసుల అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.