Thursday, February 27, 2025

రెండ్రోజుల్లో బాధితులను వెలికితీసేందుకు ప్రణాళిక సిద్ధం

భారత సరిహద్దు రక్షణా దళం సేవలను వినియోగిస్తున్నాం.. మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి

శ్రీశైలం ఎడమ కాలువ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెండు రోజుల్లో సురక్షితంగా తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం మరోసారి ఎస్‌ఎల్బిసి ప్రమాదం సంఘటన స్థలంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ సంతోష్‌, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఏజెన్సీ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, మల్లు రవితో కలిసి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టన్నెల్‌ నిర్మాణ రంగంలోనూ, సొరంగ మార్గంలో జరిగే ప్రమాదాలను ఎదుర్కొనడంలో అత్యంత ప్రతిభావంతమైన భారత సరిహద్దు దళం నిపుణులను  పిలిపించి పరిస్థితులను సమీక్షించామని తెలిపారు.

సొరంగంలో చిక్కుకున్న వారిని రెండు రోజుల్లోగా బయటికి తీయనున్నామని దీనికి సంబంధించిన కార్యాచరణ బుధవారం సాయంత్రమే ప్రారంభిస్తున్నట్టు వెల్లడిరచారు. దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత ఇంజనీరింగ్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సహాయ చర్యలకు పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నామని వివరించారు. ఎస్‌ఎల్బిసి ప్రమాద సంఘటన జరిగిన మూడు గంటల్లో సంఘటనా స్థలానికి వొచ్చి మంత్రుల బృందం సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేశారు. రెస్క్యూ టిమ్స్‌ నిరంతరం శ్రమిస్తున్నాయని. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందం బుధవారం  సాయంత్రం నుండే పనులను వేగవంతం చేయనుందన్నారు. ర్యాట్‌ హోల్‌ మైనర్‌ సేవలు వినియోగిస్తున్నామని,దేశంలో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని, సదుపాయాలను ఉపయోగించుకుని సహాయక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. భారత సరిహద్దు రక్షణ దళం (ఇండియా బోర్డర్‌ ఆర్గనైజేషన్‌) సేవలను వినియోగించుకుంటున్న ట్లు తెలిపారు. టన్నెల్‌ లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటకు పంపడం, బురదను తీసివేయడం, ద్వారా డిబిఎం ముందుభాగం చేరుకోనున్నట్లు తెలిపారు.

డిబిఎం చివరి భాగాలను గ్యాస్‌ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్లు మంత్రి వివరించారు. అనంతరం ఆర్మీ, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ , ర్యాట్‌ హాలర్స్‌ సహాయంతో వారిని వెలికి తీయనన్నట్టు ప్రకటించారు. టన్నెల్లో చిక్కుకున్న వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సహాయ కార్యక్రమాలు పాల్గొని వారి భద్రతకు ఇప్పటివరకు చాలా ప్రాధాన్యత ఇచ్చామని, వారి భద్రతా చర్యలు చేపట్టిన తర్వాతనే ఈ రెస్క్యూ ఆపరేషన్‌ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. టన్నెల్‌ లో దాదాపు 200 మీటర్ల మేర బురద, నీరు పేరుకుపోయిందని తెలిపారు. దీనితో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలిగిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు వచ్చిన ఆర్మీ నిపుణులు టన్నేల్లోకి వెళ్లి పరిస్థితులను పూర్తిగా అంచనా వేశారని అన్నారు. సహాయక చర్యలు ఇప్పటి నుంచి త్వరగా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాద సంఘటన జరిగిన వెంటనే, మూడు గంటల లోపు నుండే మంత్రుల బృందం నిరంతరం అధికారులకు అందుబాటులో ఉంటూ… సహయక చర్యలకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్‌ సి.ఎస్‌. అర్వింద్‌ కుమార్‌, ఎస్‌పిడిసిఎల్‌సీఎండీ ముషరాఫ్‌ అలీ, స్పెషల్‌ ఆఫీశర్‌ శ్రీధర్‌, జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, ఐజి చౌహన్‌, ఎల్‌ అండ్‌ టి టన్నెల్‌ రంగ నిపుణులు క్రిస్‌ కూపర్‌, రాబిన్స్‌ కంపెనీ ప్రతినిధి గ్రేన్‌ మేకర్డ్‌, ఉత్తరాఖండ్‌ లో ఇలాంటి దుర్ఘటనలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన నిపుణుల బృందం, ఆర్మీ, ఎన్‌హెచ్‌ఐడిసీఎల్‌,  ఉత్తర కాశీ టన్నెల్‌ రెస్క్యూ ర్యాట్‌ మైనర్స్‌ గ్రూప్‌ ప్రతినిధి ఫిరోజ్‌ కురేషి, ఇతర ఉన్నతాధికారుల బృందం హాజరయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com