ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కాగా.. వారణాసిలో నామినేషన్‌కు ముందు ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. తొలుత గంగాతీరంలోని దశాశ్వమేధ ఘాట్‌లో పూజలు చేశారు. అనంతరం హారతి ఇచ్చారు. దశాశ్వమేధ ఘాట్ నుంచి నమోఘాట్‌కు చేరుకుని మోదీ పూజలు చేశారు. అక్కడినుంచి కాలభైరవ ఆలయానికి ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అనంతరం మోదీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని వరుసగా మూడోసారి వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
ప్రధాని మోదీ తొలుత 2014, ఆ తర్వాత 2019లో భారీ మెజార్టీ గెలుపొందారు. మళ్లీ 2024లో వారణాసి నుంచి హ్యాట్రిక్ కొట్టి, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ధీమాగా ఉన్నారు. హ్యాట్రిక్‌పై గురిపెట్టిన ప్రధాని మోదీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014లో 3 లక్షల 37 వేల ఓట్లతో గెలిచారు ప్రధాని మోదీ. 2019లో అంతకు మించిన మెజారిటీ వచ్చింది. 4 లక్షల 80 వేల ఓట్ల తేడాతో ప్రధాని మోదీ గెలుపొందారు. ఈ సారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి.