Saturday, November 16, 2024

దివిస్ నుంచి కాపాడండి

కంపెనీ వ్యర్థాలతో పంటలు నష్టం

దివిస్ కంపెనీ నుండి వెలువడే విషవాయువు, వ్యర్థ రసాయనాల నుండి ఆరెగూడెం గ్రామ రైతులను, ప్రజలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతులు, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జెండుగే కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ దివిస్ కంపెనీ యాజమాన్యం చట్ట విరుద్ధంగా కంపెనీ ఆవరణలో వందల ఫీట్ల లోతు వందలాది బోర్లు వేసి కంపెనీ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలను బోర్లలోకి పంపడంతో వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకి ఆరెగూడెం గ్రామంలోని మొత్తం వ్యవసాయ భూమిలోని భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్నారు. సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గత నెలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నీళ్లను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపుతున్నామని చెప్పి నేటికీ ఏం జరిగిందో తెలుపలేదన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న దివిస్ కంపెనీ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలుషితమైన నీళ్లను పశువులు తాగి చనిపోతున్నాయన్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీళ్లను కొనుగోలు చేసి పశువులకు తాపుతున్నారన్నారు. మహిళలకు, గేదెలకు గర్భం నిలుస్తలేదన్నారు. ఈ నీటితో స్నానం చేసిన మనుషులు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. వేసిన పంటలు మాడి మసైపోతున్నాయన్నారు. ఎన్నిసార్లు బాధిత ప్రజలు దివిస్ కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినప్పటికి యాజమాన్యం దురుసుగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండని దబాయిస్తున్నారన్నారు.

 

సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రులు స్పందించి ఆరెగూడెం గ్రామ ప్రజలకు న్యాయం చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలని, క్షేత్రస్థాయిలో ఆరెగూడెం గ్రామానికి వచ్చి కలెక్టర్ పరిశీలించాలని కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ నరసింహులు, చీరిక సంజీవరెడ్డి, అలివేలు, నాయకులు గంగదేవి సైదులు, బబ్బురి పోశెట్టి, మాయ కృష్ణ, రాగీరు కిష్టయ్య, మచ్చ భాస్కర్, పల్లె మధుకృష్ణ, యాట బాలరాజు, పల్లె శివ, ఆకుల ధర్మయ్య, పొట్ట శ్రీను, కస్తూరి శంకరయ్య, బోయ యాదయ్య, బోదాసు వెంకటేశం, హోటల్ మారయ్య, బందెల ఎల్లయ్య పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular