కర్రెగుట్టల్లో ట్విస్ట్.. గ్రేహౌండ్స్ జవాన్లపై కోబ్రా ఫైర్.. ?
ఆపరేషన్ కర్రెగుట్టలు.. 12 వేల మంది ప్రత్యేక బలగాలు.. కర్రెగుట్టల్లో నాన్‌స్టాప్ కూంబింగ్. మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ. కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో పాటు 26 మంది ఓసారి.. 8 మంది ఓసారి ఇలా మావోయిస్టుల హతం. కూంబింగ్ బలగాలకూ ప్రాణనష్టం తప్పలేదు. ముగ్గురు గ్రేహౌండ్స్ కమాండోలు మృతి చెందారు. తెలంగాణ డీజీపీ, అడిషనల్ డీజీలు వరంగల్ వెళ్లి మరీ మృతులకు నివాళులు అర్పించారు. ఇదంతా ఒకే.. కానీ, అసలు విషయం ఇప్పుడు పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఈ గ్రేహౌండ్స్ జవాన్లను చంపింది మావోయిస్టులు కాదు.. అదే వేటలో కోబ్రా పోలీసులు అని అనుమానిస్తున్నారు. దీనికి బలమైన ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఎదురెదురుగా గ్రేహౌండ్స్, కోబ్రా టీంలు
కర్రెగుట్టలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం. కమ్యూనికేషన్ లోపంతో రాష్ట్ర గ్రేహౌండ్స్ బలగాలపై సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్ల దాడి జరిగిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. మావోయిస్టు దళంగా భావించి.. గ్రేహౌండ్స్ టీమ్, కోబ్రా జవాన్లు పరస్పరం కాల్పులు జరుపుకున్నట్టు తెలుస్తోంది. కోబ్రా కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ కమెండోలు చనిపోయారని, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులకు కొత్త విషయం తెలిసింది. ఈ విషయం రెండు రోజుల కిందటే పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసినా.. బయటకు రాకుండా మావోయిస్టులే కాల్పులు జరిపినట్టుగా ఇష్యూను డైవర్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కర్రెగుట్టల్లో భారీగా మోహరించిన బలగాలు మధ్య సమన్వయ లోపంతో ఈ అయోమయం ఏర్పడినట్టు సమాచారం. ఒకే టైంలో.. ఒకే ప్లేస్‌లో కోబ్రా జవాన్లు, గ్రేహౌండ్స్ పోలీసులు ఎదురుపడ్డారని, దీంతో గ్రేహౌండ్స్‌ను మావోయిస్టులుగా భావించి కాల్పులు చేయడంతో ముగ్గురు గ్రేహౌండ్స్ సిబ్బంది చనిపోయినట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. నిజమా? కాదా? అనేది ఎవరూ ధృవీకరించట్లేదు.
కగార్‌పై సిందూర్ ఎఫెక్ట్..
మరోవైపు.. ఆపరేషన్ కగార్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పడింది. తెలంగాణ సరిహద్దులోని సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పామూరు, ఆలూబాక, పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలను వెనక్కి రప్పిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపధ్యంలో కర్రెగుట్టల నుంచి సుమారు 9వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. ఆదివారం ఉదయంలోగా ఇండో – పాక్ బోర్డర్‌కు బలగాలు తరలి వెళ్లనున్నాయి. అయితే, ఆపరేషన్ కగార్ మాత్రం ఎప్పటిలానే కంటిన్యూ అవుతుంది. సీఆర్‌పీఎఫ్ 217, 81, 86 బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్ యథావిధిగా కొనసాగనుంది.