Friday, September 20, 2024

కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు – సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర

* కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు – సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర
* ముంబయి నటి కాదంబరీ జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
* ఈ వ్యవహారంలో సకల శాఖల మంత్రి, ముఖ్య ఐఏఎస్‌ అధికారి కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
* వారి సమక్షంలోనే కాంతిరాణా, విశాల్‌ గున్నీలకు పీఎస్‌ఆర్‌ ఆదేశాలు ఇచ్చినట్లు నిర్ధారించారు.
* కుక్కల విద్యాసాగర్‌తోనూ సీఎంఓలో మంతనాలు జరిపి కుట్రకు వ్యూహరచన చేసినట్లు గుర్తించారు.
ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు బనాయింపు, అరెస్టు, వేధింపుల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నాటి సీఎం కార్యాలయం (సీఎంఓ)లోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో ఒకరు సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు కాగా మరొకరు గత ఐదు సంవత్సారాల్లో సీఎంఓలో అన్నీ తానై వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి.
వీరి సమక్షంలోనే జనవరి 31న నాటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీలను సీఎంఓకు పిలిపించి మరీ జెత్వానీని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతకంటే రెండు, మూడు రోజుల ముందే కుక్కల విద్యాసాగర్‌నూ సీఎంఓకు పిలిపించి మొత్తం వ్యూహాన్ని వివరించినట్లు నిర్ధారించారు. ఈ భేటీలు జరిగిన సమయంలో అందరి టవర్‌ లొకేషన్లు ఒకేచోట చూపించినట్లు సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.
విశాల్‌ గున్నీ ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో కీలక విషయాల్ని విస్మరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాంతిరాణా, విశాల్‌ గున్నీలను, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సీఎంఓకు పిలిపించి జెత్వానీ వ్యవహారం అప్పగించారు. ఈ సమయంలో సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ‘ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన వ్యవహారం. చాలా రహస్యంగా చేపట్టాలి. అందుకే మీకు అప్పగిస్తున్నాం. మీకేం కావాలో మేం చూసుకుంటాం’ అని స్పష్టంగా చెప్పటంతోనే తాము అందులో తలదూర్చాల్సి వచ్చిందంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ ఐపీఎస్‌ అధికారి తన సన్నిహితులతో చెబుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయణ్ని విచారిస్తే జనవరి 31న సీఎంఓలో ఏం జరిగింది? ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అసలు సూత్రధారులు ఎవరు వంటి కీలక విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఆ ఇద్దర్నీ నిందితులుగా చేర్చే అవకాశం: ఇప్పటికే జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు, నాటి సీఎంఓలో చక్రం తిప్పిన ఐఏఎస్‌ అధికారి ప్రమేయానికి సంబంధించి పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. కుక్కల విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదుకు ప్రధాన ఆధారంగా చూపించిన డాక్యుమెంట్‌ ఫోర్జరీదని సకల శాఖల మంత్రి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులే దీని తయారీకి ఆదేశించినట్లు దర్యాప్తులో నిర్ధారించారు. విద్యాసాగర్, ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని జనవరి 31 కంటే ముందే పలుమార్లు సీఎంఓకు పిలిపించి ఈ కుట్ర ప్రణాళిక గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వీటిపై మరింత లోతైన, శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత సకల శాఖల మంత్రిని, ఐఏఎస్‌ అధికారిని నిందితులుగా చేర్చాలని వారు భావిస్తున్నారు.
వారికి ముంబయి నుంచి భారీగా లబ్ధి: కాదంబరీ జెత్వానీ టాస్క్‌లో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు ముంబయిలోని పారిశ్రామికవేత్త సంబంధీకుల నుంచి భారీగా లబ్ధి పొందినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆమెపై కేసు నమోదుకు ముందు, జెత్వానీ అరెస్ట్ తర్వాత పలు దఫాలుగా వీరికి భారీ మొత్తాల్లో సొమ్ము అందిందని తెలుస్తోంది. విచారణాధికారులు ప్రస్తుతం ఆ మూలాల్ని ఛేదించే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
భద్రపరచండి: ముంబాయి సినీనటి కాదంబరి జత్వానీ నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, డేటాను భద్రపరచాలని పోలీసులకు హైకోర్టు మరోసారి సూచించింది. మరోవైపు ఉపకరణాలను తదుపరి విచారణలోపు జత్వానీకి తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామన్నారు. అందుకు సమయం కావాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌.చక్రవర్తి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేశారు.
బుధవారం జరిగిన విచారణకు జత్వానీ, ఆమె తల్లిదండ్రులు హైకోర్టుకు హాజరు అయ్యారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఆమె నుంచి సీజ్‌ చేసిన మొబైల్‌ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన విచారణలో విద్యాసాగర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీజ్‌ చేసిన ఉపకరణాలను జత్వానీకి తిరిగి ఇచ్చేయాలని పోలీసులు చూస్తున్నారన్నారు. కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా ఆమె మీడియాతో మాట్లాడుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.
న్యాయమూర్తి స్పందిస్తూ స్వాధీనం చేసుకున్న వస్తువులను వెనక్కి ఇవ్వాలంటే సంబంధిత కోర్టు అనుమతి అవసరం అన్నారు. చట్ట నిబంధనలను గుర్తు చేశారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు సెల్‌ఫోన్, ఇప్యాడ్‌ ఇతర ఉపకరణాలను సీజ్‌ చేయడంతో బంధువులకు, సన్నిహితులకు ఫోన్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. వస్తువులను వెనక్కి తీసుకునే హక్కు ఆమెకు ఉందన్నారు.
ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను భద్రపరచాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశామన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి జత్వానీ వెసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని కుక్కల విద్యాసాగర్‌కు సూచించారు. విద్యాసాగర్‌ వ్యాజ్యంపై కౌంటర్‌ వేసేందుకు ప్రభుత్వానికి, జత్వానీకి వెసులుబాటు ఇచ్చారు. విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular