* ఆఖర్లో హేండ్సప్
* గులాబీ టూ కమలం
* పలు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్
టీఎస్, న్యూస్ :ఆఖరు నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. పోలింగ్ రోజున మధ్యలోనే కేంద్రాల నుంచి ఆ పార్టీకి చెందిన పలువురు పోలింగ్ ఏజెంట్లు బయటకు వెళ్ళిపోయారు. దీంతో పోలింగ్ రోజునే గులాబీ నేతలు అస్త్రసన్యాయం చేశారన్న వాదన రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. పైగా పలు సెగ్మెంట్ల పరిధిలో గులాబీ నేతలే స్వయంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ప్రచారం కూడా జోరుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట గులాబీ నేతలు మరీ దగ్గరుండి కమలం పార్టీకి ఓట్లు వేయించారన్న తెలుస్తోంది. దీంతో పలు నియోజకవర్గాల్లో పెద్దఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలంగాణ భవన్ లో అదే హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి రాష్ట్రంలో పోలింగ్ జరిగే నాటికి (13వ తేదీ)పలు నియోజకవర్గాల పరిధిలో ముక్కోణపు పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ గులాబీ నేతలు చేసిన నిర్వాహాకం కారమంగా పలు సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీజేపీలో మధ్యనే పోటీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ….ఈ లోక్ సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలో గౌరవ ప్రదమైన సీట్లను గెలుచుకుని తిరిగి పార్టీని నిలబెట్టాలని భావించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీలోకి దీటుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల పరిధిలోని ఎన్నికల ప్రచారాన్ని కూడా జోరుగా నిర్వహించింది. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రచారం చేశారు. దీంతో ప్రచారంలో గులాబీ పార్టీకి కూడా దూసుకపోయింది.
దీంతో ఆ రెండు పార్టీలను దీటుగా ఎదుర్కొని మెరుగైన స్థానాలను గులాబీ గెలుచుకుంటుందన్న వాదన సైతం వినిపించింది. కానీ పోలింగ్ రోజున సీన్ రివర్స్ గా కనిపించడంతో …ప్రస్తుతం ఆ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటుందన్న అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
ముక్కోణపు పోటీలో మెజారిటీ సీట్లలో రెండో ప్లేసు దక్కించుకునైనా ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్‌ఎస్ నాయకత్వం ఆశలకు.. ఈ క్రాస్ ఓటింగ్ భారీగా గండి కొట్టినట్లు చెబుతున్నారు. మెజారిటీ సీట్లలో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడేందుకూ ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నాయి. పోలింగ్ నాటికి రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖీ పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తున్న క్రమంలో క్రాస్ అయిన బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు.. ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు.
బీఆర్‌ఎ్‌సలోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ చేసినట్లూ వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీతో మంచి కోసమూ కొందరు బీఆర్‌ఎస్ నేతలు.. కాంగ్రెస్ అభ్యర్థులకు క్రాస్ చేయడానికే మెగ్గు చూపినట్లూ చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు. చేవెళ్ల నియోజకవర్గం తీసుకుంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇద్దరూ గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే. ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు, ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్‌ఎస్ ఓటింగ్‌ను తమవైపునకు తిప్పుకున్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి జరిగిన క్రాస్ ఓటింగ్ తమకు బాగా కలిసి వస్తుందని ధీమా బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీని కారణంగానే రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోబోతున్నామని వారు ఖరాఖండిగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకి ఆదరణ పెరిగిందని కమలం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మోడీ క్రేజ్ విస్పష్టంగా కనిపించిందని పేర్కొంటున్నారు.