కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో చూస్తారంటూ Transport Minister Ponnam Prabhakar రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్ష పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. బిజెపి గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందన్న బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని, దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని కులగొడతామంటున్నారు, మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్పారా..? అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. బిజెపికి చేతనైతే 10 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటును మోడీ అవమానించారని, దానిపై మీరు మాట్లాడారా అని ఆయన నిలదీశారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారా అంటూ ఆయన ప్రశ్నించారు.
బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి బిజెపి తొలగించింది
బిజెపి బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కిషన్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటున్నారు, అలాగే కొంతమంది బిజెపి నేతలు సైతం ఇదే ధోరణిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలహీన వర్గాల వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు?
టిఆర్‌ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్నటివరకు ఒక బలహీన వర్గాల వ్యక్తికి అధ్యక్ష పదవిని ఎందుకు ఇవ్వలేదని ఆయన కెటిఆర్‌ను ప్రశ్నించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అయినా సరే అధ్యక్ష పదవి వేరే వ్యక్తికి ఇవ్వవచ్చు కదా, ముఖ్యమైన పదవులు అన్నింటిలోనూ మీరే ఉండి, ఇంకా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలకు ముందు బిసిలకు ఏదైనా పదవి ఇవ్వండి, లేకపోతే మీరు ఏం చెప్పినా అది నడవదన్నారు. బిసిలకు ఈ పదేళ్లలో ఏం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పాలనలో బిసిలకు ఏం చేశారో చెప్పాలంటూ కెటిఆర్‌ను ఆయన నిలదీశారు. బిఆర్‌ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి, కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బలహీన వర్గాలకు (బిసిలకు) న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
16 కులాలకు కార్పొరేషన్‌లను కేటాయించాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 16 కులాలకు కార్పొరేషన్లు కేటాయించామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అడిగే స్వేచ్ఛ తమకుందని ఆయన పేర్కొన్నారు. 23 ఏళ్లలో బిఆర్‌ఎస్ పార్టీలో బలహీన వర్గాలకు ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ పదవులైనా బిసిలకు ఇచ్చి, కెటిఆర్ తమను విమర్శించాలని ఆయన హితవు పలికారు. బిఆర్‌ఎస్ పాలననలో చేసిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని ఆయన వివరించారు. మా పార్టీ తప్పు చేస్తే మేమే ప్రశ్నిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. 1987లో డిగ్రీ కాలేజీలో ఏబివిపిపై గెలిచిన వ్యక్తినని, తాను కలలో కూడా బిజెపి ఉసెత్తనని మంత్రి పొన్నం తేల్చి చెప్పారు.