క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన వయసు 88 ఏళ్లు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన.. రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచినట్టు వాటికన్ వర్గాలు వెల్లడించాయి.. గత ఫిబ్రవరి 14న బ్రాంకైటీస్‌తో ఆసుపత్రిలో చేరారు. పోప్ ఆరోగ్యం మెరుగుపడిందని, కానీ శ్వాసకోశ ఇబ్బంది ఇంకా ఉందని ఆసుపత్రి వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఆదివారం ( ఏప్రిల్ 20) న ఈస్టర్ సందర్భంగా ఆయన సందేశం కూడా ఇచ్చారు. క్రైస్తవుల 266వ పోప్‌గా 2013 మార్చిలో నియమితులైన పోప్ ఫ్రాన్సిస్.. 1936 డిసెంబరు 17న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ జన్మించారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా నియమితులైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. ఫిబ్రవరి 14 నుంచి నిమోనియాతో ఐదు వారాల పాటు పోరాడిన పోప్ ఫ్రాన్సిస్ (88) పూర్తి ఆరోగ్యవంతులైనట్టు మార్చిలో వాటికన్ వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన నివాసానికి వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఆయన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాకు వెళ్లి ప్రార్థనలు కూడా చేశారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ అవయవాలు దెబ్బతినడంతో పోప్ మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారని అప్పట్లో వైద్యులు వెల్లడించారు.