* కొండగట్టులో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్
* ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన పవన్ కల్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయరీతిలో స్వాగతం పలికాయి. అనంతరం, పవన్ ఇక్కడి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో, జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు.
