-
పవర్ పుల్ లీడర్ రేవంత్
-
దేశంలో అత్యంత శక్తివంతుల జాబితాలో చోటు
-
శక్తివంతుల జాబితా విడుదల చేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్
-
తొలిస్థానం ప్రధాని మోడీదే
టీఎస్ న్యూస్: దేశంలో టాప్‌లో ఉన్న శక్తివంతుల జాబితాను జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి స్థానం దక్కించుకున్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో నిలిచారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితాను ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విడుదల చేసింది. జాబితాలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, సినీ కళాకారులు, క్రీడాకారులు సహా వివిధ రంగాలుకు చెందిన ప్రముఖులున్నారు. తొలిస్థానంలో ప్రధాని నరేంద్రమోడీ నిలిచారు.
డైనమిక్ రేవంత్
సీఎం రేవంత్ రెడ్డికి రెండు నెలల వ్యవధిలోనే అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకుని, అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలోని 100 మంది మోస్ట్ పవర్ పుల్ ఇండియన్స్ జాబితాను విడుదల చేయగా, ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఉడటం విశేషం. అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో మొదటి 5 స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, కేంద్ర మంత్రి జయశంకర్ ఉన్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానంలో ఉండగా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 56వ స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే జగన్ 15 స్థానాల వెనుక ఉండటం గమనార్హం.