వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి రేవంత్ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యా కమిషన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. ప్రభుత్వ బడుల బలోపేతంపై పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులతో పాటు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగితారాణా, ఇతర అఽధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్‌కు వివరించారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టబోయే చర్యలకు సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగితారాణావివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల బలోపేతం, విద్యార్థులకు అందించే యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, భోజనం మెనూ గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ అంశాలన్నిటికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను సిద్ధం చేసుకుని త్వరలో మరో సమావేశానికి రావాలని సూచించారు.