- దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్యయనం చేయాలి
- ఎకో, టెంపుల్ టూరిజంపై ప్రధాన దృష్టి
- సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్నారు. దేశ, విదేశాల పర్యాటకుల్ని ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని చెప్పారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్ మెంట్స్ సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
వొచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్రంలో ఎకో టూరిజంకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు తో పాటు ఆదాయం వొచ్చేలా పాలసీని రూపొందించాలని సూచించారు.