Monday, March 10, 2025

మిగిలిన 13 సీట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి..!

  • మిగిలిన 13 సీట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి..!
  • ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వారే
  • తమ కుటుంబసభ్యుల కోసం ఢిల్లీలో లాబీయింగ్

మిగిలిన 13 పార్లమెంట్ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి పెరిగింది. టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలంటూ రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఏఐసిసిపై ఒత్తిడి పెంచుతున్నట్టుగా తెలిసింది. ఒకే నియోజకవర్గానికి పలు ఫ్యామిలీల నుంచి పోటీ ఉండడంతో ఎవ్వరినీ కాదనలేక ఫైనల్ నిర్ణయం తీసుకోవడం ఏఐసిసికి సవాల్‌గా మారింది. ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, నాగర్‌ర్నూల్ తదితర నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. టికెట్లు ఇవ్వడానికి ముందు ఆ పార్టీ నేతల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత విభేదాలు పెరిగే అవకాశమున్నట్లు ఏఐసి అనుమానిస్తోంది. ఖరారైన అభ్యర్థి గెలుపు కోసం సహకారం అందించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థికంటే ముందు సొంత పార్టీ లీడర్లే ఓడిస్తారన్న భయం వెంటాడుతోంది. దీనిని పరిగణనలోకి తీసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ఏఐసిసి భావిస్తున్నట్టుగా తెలిసింది. అసంతృప్తులను బుజ్జగించిన తర్వాతనే ఈ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచన తెరమీదకు ఏఐసిసి నాయకులు తీసుకొచ్చినట్టుగా తెలిసింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్‌రావ్ థాక్రే ఇదే ఫార్ములాను అమలు చేశారు.

ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న దీపాదాస్ మున్షీ కూడా అదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వారే మరోసారి ఈ టికెట్‌లను ఆశిస్తుండడంతో కాంగ్రెస్ కేడర్ ఏఐసిసి ఆలోచించి పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే నిర్ణయాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే బిజెపి తొమ్మిది మందిని, బిఆర్‌ఎస్ ఐదుగురిని, కాంగ్రెస్ నలుగురు చొప్పున అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని పార్టీలు రెండో జాబితాపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే గెలుపు ఖాయమన్న నమ్మకంతో ఆశావహులు భారీగా కాంగ్రెస్‌లో టికెట్‌ల కోసం ఆశపెట్టుకున్నారు. కానీ, ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక పిసిసి, ఏఐసిసి నేతలు తలలు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో నలుగురి పేర్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మిగతా స్థానాల కోసం ఏఐసిసిపై ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది.

పొంగులేటి వర్సెస్ భట్టి

ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడైన ప్రసాదరెడ్డికి టికెట్ కావాలని కోరుకుంటున్నారు. దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలతో ఒక దఫా సంప్రదింపులు జరిగాయి. ఇక అదే నియోజకవర్గంలో టికెట్ కోసం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాల్లో టికెట్ ఈ రెండు కుటుంబాల్లో ఎవరికి ఇచ్చినా జిల్లాలో పార్టీపరంగా రాజకీయంగా పైచేయి సాధిస్తారని, మరో ఫ్యామిలీని ఎదగనీయకుండా చక్రం తిప్పుతారన్న పరస్పర అనుమానాలు ఉన్నాయి. ఇద్దరూ కేబినెట్లో మంత్రులుగా ఉన్నా, ఒకే జిల్లాలో ఒక్క పార్టీ నేతలే అయినా ఆధిపత్యం విషయంలో రాజీ పడడం లేదు.

నాగర్‌కర్నూల్ టికెట్ కోసం 26 దరఖాస్తులు

నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మాజీ ఎంపి మల్లు రవికి టికెట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన సోదరుడు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సిఎంగా ఉన్నారు. అదే ఫ్యామిలీ నుంచి ఎంపి టికెట్ ఇస్తే మరికొందరు నేతల నుంచి ఇదే తరహాలో డిమాండ్ వస్తుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. నాగర్‌కర్నూల్ స్థానాన్ని మల్లు రవికి బదులుగా మరొకరికి ఇవ్వాలంటూ అగ్ర నాయత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నియోజకవర్గానికి మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నందున టికెట్ ఇవ్వొద్దన్న ఒత్తిడి ఏఐసిసిపై ఉంది.

పెద్దపల్లి నియోజకవర్గంలో వివేక్ ఫ్యామిలీ

పెద్దపల్లి నియోజకవర్గంలోనూ ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంలో ఏఐసిసికి అంతుచిక్కడం లేదు. ఈ స్థానానికి ఏకంగా 30 దరఖాస్తులు వచ్చాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెల్చుకుంది. ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమన్న ఉద్దేశంతో టికెట్ కోసం భారీ పోటీ నెలకొంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన కుమారుడైన వంశీ కోసం ప్రయత్నిస్తుండగా ఇప్పటికే బెల్లంపల్లిలో గడ్డం వినోద్ (వివేక్ సోదరుడు) ఉన్నందున ఒకే ఫ్యామిలీకి మూడు పదవులు ఉంటాయన్న అసంతృప్తి లోకల్ లీడర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఈ స్థానంలో టికెట్ కోసం గజ్జెల కాంతం, మాజీ ఎంపి సుగుణ కుమారి పోటీ పడుతున్నారు. మాదిగ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజికవర్గానికే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ పెరిగింది. కానీ గడ్డం వంశీ మాల కమ్యూనిటీ కావడంతో హైకమాండ్ ఆలోచిస్తుంది.

చామలకు ఇస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి వ్యతిరేకత

భువనగిరి నియోజకవర్గంలో సైతం అభ్యర్థిని ఖరారు చేయడం ఏఐసిసికి తలనొప్పిగా మారింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తె కోసం ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే టికెట్ కోసం సిఎం రేవంత్ సన్నిహితంగా ఉండే చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బిసి సామాజిక వర్గానికి చెందిన పిసిసి అధికారిక ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కాదనీ చామల కిరణ్ రెడ్డికి ఇస్తే ఆ బ్రదర్స్ నుంచి సహకారం ఉండదన్న అనుమానాన్ని ఏఐసిసి వ్యక్తం చేస్తోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో జనగాం మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలూ కాంగ్రెస్ పార్టీవే. దీంతో ఎంపి టికెట్‌కు డిమాండ్ ఎక్కువైంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com