డేటింగ్ స్కామ్ లు రోజురోజుకు పెరిగిపోతున్నాయ్. . అందమైన మహిళలను ఎరగా వేసి.. అబ్బాయిలను బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన పలు ఉందంతాలను ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఈ డేటింగ్ యాప్ స్కామ్‌ను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ డేటింగ్ యాప్ లో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి అబ్బాయిలను బోల్తా కొట్టిస్తారు. ఆ తరువాత ఆ అమ్మాయిలు హోటల్, పబ్‌కు వెళ్దామని చెప్పి అక్కడికి యువకులను తీసుకెళ్లి.. ముందుగా వారికి నచ్చిన ఫుడ్, మందు ఆర్డర్ చేస్తారు. శుభ్రంగా తినేసి, తాగేసి అన్ని ఆర్డర్‌లు టేబుల్‌పైకి వచ్చిన తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటారు.
ఇవేమీ తెలియని అబ్బాయిలు ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ.. అక్కడే కుర్చుంటారు. ఆ తరువాత బిల్లు వస్తుంది. ఆ బిల్లు మాములుగా ఉండదు. ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. డబ్బులు కట్టకపోతే బౌన్సర్లతో బెదిరింపులు, దాడులు చేయిస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోలేక బిల్లు డబ్బులు కట్టేసి అక్కడినుంచి బయటపడుతున్నారు. ఇందులో దాదాపుగా 12మంది బాధితులు రూ. 23,000 నుంచి ఏకంగా రూ.61, 743 వరకు బిల్లులు కట్టి బయటపడ్డారు. ఈ బిల్లులను దీపికా నారాయణ్ భరద్వాజ్ సోషల్ మీడియలో పోస్టు చేశారు. ముంబైలో పలు క్లబ్‌లు ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నారని సమాచారం. ఇలాంటి కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది.