కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ జనానికి కిలాడీ జంట టోకరా
రాజకీయ నాయకులు తమకు తెలుసని, వారిని కలిపిస్తామని చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేవాళ్ల గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఓ కిలాడీ జంట మాత్రం అంతకంటే హైప్రోఫైల్ మోసాలకు పాల్పడింది. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ పేరును అడ్డంపెట్టుకుని కోట్లు కొల్లగొట్టింది. ప్రధాని మోదీ కార్యదర్శి కుటుంబ సభ్యులమని నమ్మించి, కాంట్రాక్టుల పేరుతో అనేక మంది నుంచి కోట్లల్లో కమిషన్‌లు తీసుకుంది. చివరకు బండారం బయటపడటంతో కటకటాలపాలైంది.
ఒడిశాకు చెందిన 38 ఏళ్ల హన్సితా అభిలిప్సా, అనిల్ మొహంతి ఇద్దరూ భార్యాభర్తలు. వీరు భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనం అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అభిలిప్సా తాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా కూతురునని చెప్పి పలువురిని పరిచయం చేసుకుంది. అందరినీ నమ్మించేందుకు అనేక మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలను కార్యాలయంలో పెట్టుకుంది. ఆమె భర్త మొహంతి కూడా తాను మిశ్రా అల్లుడినని పలువురిని నమ్మించాడు. ఈ విధంగా వారు ప్రభుత్వం నుంచి టెండర్లు ఇప్పిస్తామని, ఏవైనా పనులు కావాలన్నా చేసిపెడుతామని ప్రచారం చేసుకున్నారు. వారి మాటలు నమ్మిన వారి నుంచి కమిషన్‌ల పేరుతో కోట్ల రూపాయలు పిండుకున్నారు. అభిలిప్సా.. మైనింగ్, నిర్మాణం, వ్యాపార రంగాలకు చెందిన ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుంది. వారి నుంచి కోట్లు వసూలు చేసింది. అయితే కమిషన్ ముట్టజెప్పినా కాంట్రాక్టులు ఇప్పించకపోవడంతో వారిపై ఈ నెల 26న ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో కిలాడీ జంట బాగోతం బయటపడింది. పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.