-
52 వేల నగదు.. నాలుగు ఉంగరాలు
-
మొత్తం ఆస్తి రూ. 3.02 కోట్లు
-
ప్రధాని మోదీ ఆస్తులివే
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ ఆస్తుల అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. నామినేషన్ సందర్భంగా తన ఆస్తుల వివరాలకు సంబంధించిన ఆఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గుజరాత్‌కి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత భారతదేశానికి పదేళ్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ఆఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సొంత ఇల్లు, కారు లేదని భారత ప్రధాని మోదీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేవలం 3.02 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే తన దగ్గర ఉన్నట్లు ఆఫిడవిట్లో ప్రకటించారు. తన ఆస్తిలో 2.86 కోట్లు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. గాంధీనగర్, వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాల్లో 80వేల 304 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన దగ్గర 52 వేల 920 రూపాయల నగదు, 2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.
2014లో మోదీ ఎంపీగా పోటీ చేసినప్పుడు.. ప్రజెంట్ మోదీ డిక్లేర్ చేసిన ఆస్తులతో పోల్చుకుంటే 2019లో ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2018-19లో 11.14 లక్షల రూపాయలు ఉన్న తన ఆదాయం.. 2022-23లో 23.56 లక్షలకు పెరిగినట్లు తెలిపారు మోదీ. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో 9.12 లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అయితే, ప్రధాని మోదీకి ఎలాంటి భూములు కానీ, ఇల్లు, కారు, షేర్లు, మ్యూచుఫల్ పండ్స్‌లో పెట్టుబడులు కానీ లేవని ఆఫిడవిట్లో తెలిపారు. ప్రభుత్వ జీతం, బ్యాంకుల నుంచి వడ్డీలను తన ఆదాయ మార్గాలుగా మోదీ ప్రకటించారు.
1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్.. 1983లో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు మోదీ. ఇప్పటివరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ప్రభుత్వ బకాయిల కేసులు కూడా లేవని ప్రధాని వెల్లడించారు. ఇక, తన భార్య ఆదాయమార్గాలు తనకు తెలియవని అఫిడవిట్లో స్పష్టం చేశారు.