- ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం
- మృతుడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ గా గుర్తింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గత ఫిబ్రవరి 22న టన్నెల్ లో ప్రమాదం జరగగా ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్ ఆపరేటర్లు చిక్కుకొని జలసమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పలు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు వారి ఆచూకీ కోసం పనిచేస్తున్నాయి. ఈ కమ్రంలోనే మరో కార్మికుడి మృతదేహం ఆచూకీ లభ్యమైనది. టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి టిబిఎం మిషన్ కింద కన్వేయర్ బెల్టు డ్రమ్‌కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి.
టన్నెల్ లో మినీ జెసిపి ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అట్టి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన వస్తుండడంతో మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు దుర్వాసన వొస్తుండడంతో స్ప్రే బాటిల్స్ తీసుకొని లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి టిబిఎం మిషన్ పరికరాలు గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించడం, మృతదేహం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలు, మట్టి బురద తొలగించడం లాంటి సహాయక చర్యలు వేగవంతం చేసి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.
మనోజ్ కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా
ఎస్ఎల్బిసి టన్నెల్ లో మంగళవారం జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంజనీర్ గా విధులు నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, తెలిపారు. ప్రభుత్వం తరఫున 25 లక్షల ఎక్స్ గ్రేషియా వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు, వైద్య పరీక్షల అనంతరం మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించనున్నట్లు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా బంగార్మౌ గ్రామానికి చెందిన మృతుడు మనోజ్ కుమార్ కు.. భార్య స్వర్ణలత, కుమారుడు ఆదర్శ్, కుమార్తె శైలజ, తల్లి జమున దేవి ఉన్నారు.