Sunday, January 19, 2025

65 ‌లక్షల మందికి ఆస్తి హక్కు కార్డులు

వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పంపిణీ
ఆస్తి హక్కులతో భరోసా వొస్తుందన్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సుమారు 65 లక్షల ఆస్తి హక్కు కార్డులు పంపిణీ చేశారు. అవి ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తాయని, దారిద్య నిర్మూలనకు దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా లబ్దిదారులు కొంత మందితో మాట్లాడారు. ఈ పథకం రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి తోడ్పడుతుందని ఆయన చెప్పారు. పది రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మధ్య ప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, మిజోరామ్‌, ఒడిశా, పంజాబ్‌, ‌రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, ‌రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్‌, ‌లడఖ్‌లలోని 50 వేల పైచిలుకు గ్రామాల్లో లబ్దిదారులకు ఈ ఆస్తి కార్డులు పంపిణీ చేశారు.

‘శనివారం 65 లక్షల కార్డుల పంపిణీ దృష్టా గ్రామాల్లోని సుమారు 2.24 కోట్ల మంది లబ్దిదారుల వద్ద ఇప్పుడు స్వమిత్వ ఆస్తి కార్డులు ఉంటాయి’ అని ప్రధాని తెలిపారు. ‘ఆస్తి హక్కులు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సవాల్‌. ‌కొన్ని ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి (యుఎన్‌) ఒక సర్వే నిర్వహించింది. పలు దేశాల్లో ఆస్తి హక్కులకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు జనం వద్ద లేవని ఆ సర్వే వెల్లడించింది. దారిద్య్ర నిర్మూలనకు ఆస్తి హక్కులు ముఖ్యం అని యుఎన్‌ ‌స్పష్టం చేసింది’ అని మోదీ తెలియజేశారు. గ్రామాల్లో ఆస్తి ఒక ‘వ్యర్థ మూలధనం’ అని, దానితో ప్రజలు ఏ చేయలేరని, వారి ఆదాయం పెంపునకు అది తోడ్పడదని ప్రముఖ ఆర్థికవేత్త ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారని ప్రధాని చెప్పారు. ’భారత్‌పై ఈ సవాల్‌ ‌ప్రభావం పడింది.

గ్రామాల్లో ప్రజల వద్ద లక్షలాది రూపాయలు విలువ చేసే ఆస్తి ఉంది, కానీ వారి వద్ద ఆ ఆస్తి పత్రాలు లేవు. వివాదాలు ఉన్నాయి, ఆస్తులు లాక్కున్నారు, తుదకు బ్యాంకులు సైతం దానిపై రుణాలు ఇవ్వడం లేదు’ అని ఆయన వివరించారు. ‘పూర్వపు ప్రభుత్వాలు దాని గురించి ఏదైనా చేయడానికి చర్యలు తీసుకున్నాయి. కానీ అంతగా ఏదీ జరగలేదు’ అని ఆయన చెప్పారు. దళితులు, వెనుకబడిన తరగతులవారు, ఆదివాసీలు దీని వల్ల దారుణంగా నష్టపోయారని మోదీ తెలిపారు. ‘చట్టబద్ధమైన ఆస్తి హక్కులు పొందిన తరువాత లక్షలాది మంది ప్రజలు రుణం తీసుకున్నారు.

తమ వ్యాపారాలు ప్రారంభించేందుకు వారు ఈ డబ్బు ఉపయోగించు కున్నారు. వారిలో అనేక మంది రైతులు, వారికి ఈ ఆస్తి కార్డులు ఆర్థిక భద్రతకు గ్యారంటీ’ అని మోదీ చెప్పారు. స్వమిత్వ, భూ ఆధార్‌ ‌గ్రామాల అభివృద్ధికి పునాది అవుతాయని కూడా ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి రాజీవ్‌ ‌రంజన్‌ ‌సింగ్‌ ‘‌లలన్‌’, ‌సహాయ మంత్రి ఎస్‌పి సింగ్‌ ‌భాఘెల్‌, ‌కార్యదర్శి వివేక్‌ ‌భరద్వాజ్‌ ‌కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు సిఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com