Thursday, December 26, 2024

రాజకీయాలు చేసుకోండి….

  • ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయవద్దు
  • రాజకీయ నాయకులకు ఉద్యోగ సంఘాల నాయకుల విజ్ఞప్తి
  • రాష్ట్రవ్యాప్తంగా నేడు నల్లబ్యాడ్జీలతో విధులకు ఉద్యోగుల హాజరు
  • భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టాలని
  • ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల పిలుపు
  • ఉద్యోగులకు అండగా ఉంటాం
  • అధికారులపై దాడిని ఖండించిన సంఘం నాయకులు

రాజకీయాలు చేసుకోండి, కానీ, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయవద్దని రాజకీయ నాయకులకు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు విజ్ఞప్తి చేశారు. లగచర్ల దాడికి నిరసనగా ఉద్యోగులు నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడంతో పాటు లంచ్ అవర్‌లో నిరసన వ్యక్తం చేస్తారని వారు తెలిపారు. అధికారులు, ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసి తరపున నాంపల్లిలోని టిఎన్జీఓ భవనంలో అన్ని సంఘాల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా జేఏసి నాయకులు హామీనిచ్చారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేయడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

వికారాబాద్‌లో జరిగిన దాడిలో బండలు, కర్రలతో దాడి చేశారని, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి దాడులు జరగలేదని ఆయన అన్నారు. కులగణన చేసే సమయంలో కూడా అధికారులు, సిబ్బందిపై మాటలతో దాడి చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. కలెక్టర్, అధికారులపై దాడిచేసిన వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భౌతిక దాడులతో విధి నిర్వహణ సమయంలో తమ స్వేచ్ఛను హరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లగచర్ల దాడి తర్వాత తెలంగాణలో ఉద్యోగులు భయంతో పని చేస్తున్నారని వారన్నారు. ఇప్పటివరకు భూసేకరణ జరగకుండా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని వారు ప్రశ్నించారు.

రాజకీయ నాయకులు జనాలను చైతన్యపరచాలి
రాజకీయ నాయకులు జనాలను రెచ్చగొట్టకుండా చైతన్యపరచాలని వారు సూచించారు. ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పట్టికీ వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకునే మార్గం చూడాలి తప్ప, చట్టాన్ని తమ చేతిలో తీసుకొని విధులు నిర్వహిస్తున్న అధికారుల మీద దాడులు చేయడం హేయమైన చర్యని వారు అభివర్ణించారు. రాష్ట్రంలో మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే భవిష్యత్‌లో 10 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు నాయకత్వం వహించే 206 ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంతో తగిన ఉద్యమ కార్యచరణకు పిలుపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ముజీబ్ హుస్సేనీ, ఏ.సత్యనారాయణ, కో చైర్మన్‌లు వి. రవీందర్ రెడ్డి, చావా రవి, నాగిరెడ్డి, జి. జ్ఞానేశ్వర్, తెలంగాణ గ్రూప్ -1 అధికారుల సంఘ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, ఫైనాన్స్ సెక్రటరీ కె. వెంకటేశ్వర్లు ప్రచార కార్యదర్శి బి. శ్యామ్, రాష్ట్ర కార్యదర్శి ముత్యాల సత్యనారాయణ గౌడ్, గంగాధర్, గోల్కొండ సతీష్, టిఎన్జీఓ రంగారెడ్డి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నగర శాఖ అధ్యక్షులు కార్యదర్శి కె.శ్రీకాంత్, పి హరికృష్ణ, హైదరాబాద్ టిజిఓ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, టిఎన్జీఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com