మొన్నటిదాకా బుల్డోజర్లు వెంటేసుకుని హైదరాబాద్ అంతా తిరిగిన హైడ్రా ఒక్కసారిగా తీరు మార్చుకుంది. అక్రమ నిర్మాణాలను కూల్చుతాం.. అంటూ బల్లగుద్ది మరీ చెప్పిన హైడ్రా ఇప్పుడు చెరువులు, కుంటల్లో పూడికతీత పనులకు దిగింది. అది కూల్చాం.. ఇదీ కూల్చాం.. అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లు కూల్చాం అంటూ ప్రెస్‌మీట్లు పెట్టి లెక్కలు చెప్పిన హైడ్రా చీఫ్.. తాజాగా చెరువులో మోకాల్లోతు పూడిక తీశాం.. నాలుగు అడుగుల్లో నీరు తెప్పించాం అంటూ చెప్పుకుంటున్నారు. అసలు హైడ్రా వ్యూహం ఏమిటి..?, కూల్చివేతల నుంచి పూడికతీతలకు ఎందుకు మారిందనేదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్న అసలు వ్యూహం నుంచి హైడ్రా బయటకు వచ్చింది. ఇప్పుడు హైడ్రా తీరు మరింది.. వ్యూహం దిశ మార్చుకున్నది. రాత్రికి రాత్రి బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలు నిర్దాక్ష్యణ్యంగా కూల్చివేసిన పరిస్థితుల నుంచి నీళ్లు తెప్పిస్తాం.. పునాదులు తీస్తాం అనే తీరున తయారైంది.
24, ఆగస్టు 2024.. శనివారం ఉదయం తెల్లవారకముందే హైడ్రా బుల్డోజర్లు మాదాపూర్‌లోని ఎన్ కన్వేన్షన్ మీద బకెట్లు ఎక్కు పెట్టాయి. తుమ్మడి చెరువు ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి నిర్మాణం చేశారంటూ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వేన్షన్‌ను గంటల వ్యవధిలోనే కూల్చివేశాయి. ఇది హైడ్రా మొదటి ఆపరేషన్.. ఇక అప్పటి నుంచి హైడ్రా పేరు విండేనే హడలెత్తే విధంగా మారింది. సెలవు రోజులను అదునుగా చేసుకుని కూల్చివేతలు చేపట్టింది. సాధారణ రోజుల్లో కూల్చివేస్తే.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనే ఉద్దేశంతో.. రెండో శనివారం.. లేదా ఆదివారం వచ్చిందంటే హైడ్రా బుల్డోజర్లు రెడీగా ఉండేవి. ఆ తర్వాత హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దంటూ సూచించింది. కానీ, హైడ్రా ఊరుకోలేదు. యధాతథంగా ఆక్రమణలను కూల్చివేసింది. అప్పటి నుంచి మొన్నటి వరకూ హైడ్రా అంటేనే వణుకు పుట్టేది. చివరకు మూసీ చుట్టూరా నివాసాలను సైతం హైడ్రా టార్గెట్ చేసింది.
హైడ్రా ఎందుకంటే..?
హైదరాబాద్‌లో దశాబ్దాల చరిత్ర కలిగిన చెరువులను ఆక్రమణ కోరల నుంచి రక్షించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అందుకు అనుగుణంగానే హైడ్రా కూడా తొలి రోజుల్లో దూకుడు చూపించింది. దీంతో కొద్ది రోజుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే హైడ్రా హైస్పీడ్ యాక్షన్ ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడమే కాదు, ప్రతిపక్షాలకు పోరాట అస్త్రాలను ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ నేతృత్వంలో మొదటి నుంచి వేసిన ప్రతీ అడుగూ వివాదమే అయింది. ప్రతీ కూల్చివేతలో రాజకీయ రాద్దాంతమే జరిగింది. నాగార్జున ఎన్ కన్వెషన్ మొదలు బడా బాబుల భవంతులు, పేరు మోసిన నిర్మాణాల వరకూ ఎవర్నీ వదల్లేదు. ప్రతిపక్షాలు ఏకిపారేసినా.. డోన్ట్ కేర్ అంటూ హైస్పీడ్ బుల్డోజర్‌లా దూసుకెళ్లింది. దీంతో కొద్దికాలం తర్వాత హైడ్రాకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. సెలవురోజుల్లో కూల్చివేతలు ఎందుకంటూ నిలదీసింది. నలువైపుల నుంచి వచ్చిన విమర్సలు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా హైడ్రా స్పీడ్ తగ్గింది.
ఇప్పుడు వ్యూహమే మారింది
నిజానికి, హైడ్రా కూల్చివేతల వల్ల ఎంతో మంది ఇళ్లు కోల్పోయారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇంత జరుగుతున్నా హైడ్రా మాత్రం మా లక్ష్యం చెరువుల పునరుద్దరణ, భావితరాల భవితవ్యం అంటూ చెప్పుకొస్తూనే ఉంది. నేటీకి అదే సంకల్పం అంటూ చెప్తున్నది. కానీ, తాజాగా హైడ్రా వ్యూహాలు మొత్తం మారిపోయాయి. నాలుగు రోజుల కిందట బతుకమ్మ కుంట ను బతికించామంటూ హైడ్రా ప్రకటన చేసింది. అంబర్‌పేట మండలంలోని బాగ్ అంబర్ పేటలో ఉన్న బతుకమ్మ కుంట చెరువు దాదాపు ఎనభై శాతంపైగా ఆక్రమణకు గురైంది. 16 ఎకరాలు చెరువు కాస్తా 5 ఎకరాలకు వచ్చింది. అది కూడా పూర్తిగా ముళ్లకంచెలతో నిండిపోయి. దీన్ని కూడా కబ్జాదారులు హస్తగతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో స్థానికులు సమస్యను హైడ్రాకు చేరవేశారు. మా బతుకమ్మ కుంటను బతికించండి అంటూ వేడుకున్నారు. ఇలా రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్‌లు ఈసారి చెరువు ఆక్రమించి ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతంలో ముళ్లకంచెలు తొలిగించే పనిలోకి దిగింది. అలా బుల్డోజర్లు భూమిని తాకగానే గంగమ్మ ఉబికి వచ్చింది. ఇక్కడ చెరువు లేదు అన్నవాళ్ల నోళ్లు మూయించేలా బతుకమ్మకుంటలో నీళ్లు బయటకు తీశామంటూ హైడ్రా భుజాలు ఎగురవేసింది. ఇంతలోనే ఇక్కడ మరో వివాదం బయటకు వచ్చింది. వచ్చిన నీళ్లు ఉబికి రాలేదంటూ.. పైపులైన్ పగిలి వచ్చాయంటూ అక్కడ పైపులైన్‌ను కొంతమంది బయటకు చూపించారు. దీంతో మళ్లీ వివాదమే అయింది. అయితే, తొలిరోజుల్లో హైడ్రా చెరువు ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చివేసి 16 ఎకరాల చెరువును వెలుగులోకి తెచ్చేది కానీ మారిన హైడ్రా అలాంటి సాహసం చేయలేదు. మిగలిన 5 ఎకరాలు బాగుచేసి చెరువును సుందరీకరణ చేసే పనిలో నిమగ్నమైంంది. ఇంతేకాదు.. ఇలా ఇంకా ఆరు చెరువులను గుర్తించిన హైడ్రా.. అక్కడ కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం పక్కన పెట్టి.. చెరువుల్లో పూడికతీత పనులకు దిగుతోంది. మరోవైపు దేవరయాంజల్‌లో కూడా ఓ ప్రహారీని కూల్చివేసి.. దళిత కాలనీకి దారి చూపించాం అంటూ ప్రకటించింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ వెంచర్ల కోసం ప్రహారీ గోడ పెట్టిందని, దాన్ని కూల్చివేయడంతో దళిత వాడకు వెళ్లేందుకు దారి కనిపించిందని దాని సారాంశం. కానీ, ఆ వెంచర్లు వేసిన ప్రాంతంలో సగభాగం ఆక్రమించిందేనని కూడా ఆరోపణలున్నాయి.