పూరి మ్యూజింగ్స్ పేరుతో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ వివిధ ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు. తాజాగా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఉన్న ఒక దేశం గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాలా మందికి తెలియని ఒక చిన్న దేశం లిక్టన్‌స్టైన్ గురించి ఆయన వివరించారు. కేవలం 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ దేశాన్ని కారులో 30 నిమిషాల్లో మొత్తం చుట్టేయవచ్చని చెప్పారు. ఎన్నో విమానాశ్రయాల కంటే కూడా ఈ దేశం చిన్నదిగా ఉంటుందన్నారు. ఆ దేశం స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉందని, ఈ దేశాన్ని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడని చెప్పారు. ఆ రాజు కుటుంబం ఒక కొండపై నివసిస్తోందని తెలిపారు.
రోమన్ క్యాథలిక్స్ ఉండే ఆ దేశంలో జర్మన్ భాష మాట్లాడతారని, ఈ దేశానికి వాయుమార్గం, జలమార్గం లేవని, జ్యూరిక్ నుంచి రైల్లో గానీ, కార్లలో గానీ వెళ్లవచ్చని అన్నారు. భద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో ఇది ఒకటని చెప్పారు. ఆ దేశ జనాభా 40 వేలకు మించి ఉండదని, ఆ దేశంలో నేరాలు జరగవని అన్నారు. అందుకే అక్కడి వారు తమ ఇంటికి ఎప్పుడూ తాళం కూడా వేయరని తెలిపారు. పన్ను రాయితీల కోసం బయటి వారు ఎక్కువగా ఆ దేశంలో కంపెనీలు నెలకొల్పుతుంటారని చెప్పారు.
నేషనల్ హాలిడేస్, పండుగల సమయంలో అక్కడి ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరిస్తారని, ఆగస్టు 15న వారి నేషనల్ డే నిర్వహిస్తారని తెలిపారు. ఎవరికైనా కావాలంటే 70 వేల డాలర్లు చెల్లించి ఈ దేశాన్ని ఒక్క రోజు అద్దెకు తీసుకోవచ్చని, ఆ రోజు వారికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతారని, అంతే కాకుండా రాయల్ ప్యాలెస్‌లో వసతి ఏర్పాటు చేస్తారని తెలిపారు. అంతే కాకుండా స్ట్రీట్ బోర్డులు వారి పేరిట ఏర్పాటు చేస్తారని, వారిని ఒక రాజు మాదిరిగా గౌరవించడంతో పాటు వారి ఫోటోతో ఫేక్ కరెన్సీని ముద్రిస్తారన్నారు. ఆ కరెన్సీతో అక్కడ ఏది కావాలంటే అది కొనుగోలు కూడా చేయవచ్చని తెలిపారు.