Tuesday, December 24, 2024

Pushpa 2 Review: కథ లేకుండానే పూనకాలు

  • అర్థం కాని బన్ని డైలాగ్ లు..
  • రష్మిక బూతు సరసం
  • యాక్టింగ్ తో సాగింది పుష్ప

‘‘ ఎవ్వడైనా రానియ్.. ఏదైనా కానియ్.. తగ్గేదేలే.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది’’ అంటూ పెళ్లి పీటలపై శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఫస్ట్ పార్ట్‌కి ఎండ్ కార్డ్ వేసిన పుష్పరాజ్.. సెకండ్ పార్ట్‌లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్‌లో ఉందంటే.. ‘‘ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్’’ ఈ ఒక్క డైలాగ్‌తో ‘పుష్ప’లో వాడీవేడీ దీనవ్వా తగ్గేదేలే అని ఎంట్రీ సీన్‌తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని చెప్పకనే చెప్పాడు ‘పుష్ప’. యాక్టింగ్ తో ఇరగదీసినా .. కథ లేకుండానే సినిమా నడిపించాడు సుకుమార్.

ఇక, రష్మిక మొత్తం బూతు కథ కూడా సినిమాను పండించింది. బన్ని నటన, డైలాగ్స్, టెక్నీషియన్స్ అందరూ మెచ్చేలా చూపించారు. ఇక సినిమాలో బన్ని డైలాగ్స్ అర్థం కాకుండా ఉండటం నిరుత్సాహం కలిగిస్తుంది. అయితే, ఏదో ఉత్కంఠగా ఉంటాయని అనుకున్న పాత్రలను అర్థం లేకుండా చంపేశారు.

ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంతపెద్ద తారాగణం ఉన్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ ‘పుష్ప-2’ కథానాయకుడి రూలింగ్‌నే కథగా మలిచారు సుకుమార్. ‘పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో పపంచానికి చూపిస్తా’ అని పుష్ప ట్రైలర్‌‌లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు.. అదే అసలు కథ.. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్ప రాజ్ (అల్లు అర్జున్) తన భార్య శ్రీవల్లి (రష్మిక)కి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు? పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేతంట రూలింగ్ చేసి.. రాజకీయాలను ఏవిధంగా శాసించాడు? పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్(ఫహాద్ ఫాజిల్)తో ఢీ కొట్టి.. తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు? తన ఇంటిపేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ.

సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్‌ని మించే ఉండాలనే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండటం కాదు.. వాటికి నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్‌తో. వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండా వైల్డ్‌గానే ‘పుష్ప’ పార్ట్‌కి పదును పెట్టిన సుకుమార్.. మరింత పదునెక్కించారు తప్పితే.. దీనవ్వా ఇంచుకూడా ఫైర్ తగ్గించలేదు.

కనిపించని కథ

పుష్ప ది రైజ్- ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ. ఇందులో పెద్ద గొప్పేం ఉంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు. తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే.. అసలు కథ ‘పుష్ప ది రూల్’ సెకండ్ పార్ట్ కోసం దాచి పెట్టాడనే అనుకున్నారంతా. కానీ.. సెకండ్ పార్ట్ చూసిన తరువాత ఫస్ట్ పార్ట్‌లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్‌లో కథే లేదనే కంప్లైంట్ అయితే మస్ట్‌గా వస్తుంది. కానీ కథ లేకుండా కేవలం పుష్ప గాడి రూలింగ్‌తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడా తప్పకుండా రాంపేజ్ షో చూపించారు.

పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్‌లో కంటే సెకండ్ పార్ట్‌లో ఇంకా పవర్ ఫుల్‌గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. మాసివ్ సీక్వెల్‌లో ఒకదాని తరువాత మరొకటి.. హై ఓల్టేజ్ సీన్‌లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి.. అసలు కథ ఏమౌతుంది? అన్న ఆలోచన లేకుండా పుష్ప‌లో వైల్డ్ ఫైర్‌ని ఓన్‌ చేసుకునేలా తీశాడు సుకుమార్‌.

కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తోనే కాకుండా.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగోడైనా పెళ్లం మాట వినాలని.. ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందనం నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్నే సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్లుకప్పి ఎర్రచందాన్ని విదేశాలకు తరలించే సీన్లు.. కొత్త రకం స్మిగ్లింగ్‌లు.. ఎత్తులకు పై ఎత్తులు ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టారనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్టాఫ్‌ని చాలా వరకూ సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే.. సెకండాఫ్‌ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. అల్లు అర్జున్ ఈ సినిమాతో పుష్ప 2 ముందు వరకూ అల్లు అర్జున్ నటన ఓ లెక్క.. పుష్ప 2 తరువాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్.. అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్‌లో పర్ఫెక్ట్ నటుడ్ని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్‌లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా? అన్నట్టుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్‌ గూస్ బంప్స్ అంతే. అలాంటి సీన్లు.. ఐదు నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు.

ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే రప్ప రప్పా యాక్షన్ బ్లాక్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ అని చెప్పాలి. విలన్లను ఊచకోత కోసేయడమే అన్నట్టుగా కాకుండా.. ప్రీ క్లైమాక్స్ ఫైట్‌కి ఎమోషన్స్‌కి కనెక్ట్ చేసిన తీరు అద్భుతం అనే చెప్పాలి. కాళ్లు చేతులు కట్టేసి.. చేసే ఈ ఫైట్ అల్లు అర్జున్‌లోని ఉగ్ర నరసింహుడు ప్రవేశించినట్టు అనిపిస్తాడు.

పుష్ప పార్ట్‌ 1 అల్లు అర్జున్ మ్యానరిజమ్ గురించే అంతా మాటాడుకున్నారు. కానీ ఇందులో అతని మ్యానిరిజమ్ నెక్స్ట్ లెవల్ ఉంది. నోట్లో పాన్ వేసుకుని భుజం పైకి ఎత్తి రాష్ట్ర సీఎంలను సైతం గడగడలాడించే పవర్ ప్యాక్డ్ ఎలివేషన్స్‌ సీన్లలో బీభత్సమైన హైప్ వచ్చింది. ‘పుష్పగాడు తగ్గాలని చాలామంది ఎదురు చూస్తున్నారులే.. దీనవ్వా తగ్గేదేలే’ లాంటి డైలాగ్‌లతో పాటు వేయాల్సిన వాళ్లకి చాలానే చురకలు వేశాడు అల్లు అర్జున్.

అయితే చాలా చోట్ల పుష్ప రాజ్ డైలాగ్‌లు అర్థం కావు. డబ్బింగే అలా చెప్పాడా? లేదంటే ఆ డైలాగ్ మాడ్యులేషనే అలా ఉందా? లేదంటే పుష్పరాజ్ మ్యానరిజమే అది కాబట్టి డైలాగ్‌లు కూడా అలాగే చెప్పించారో ఏమో కానీ.. డైలాగ్‌లు అయితే చాలాచోట్ల అర్థం కావు. ఏంటీ.. ఏమన్నాడూ.. అని థియేటర్స్‌లో ఒకర్నొకరు అడుక్కునే పరిస్థితి కనిపించింది. ఆ విషయంలో మరింత జాగ్రత్త పడితే బాగుండేది.

రష్మిక బూతు పురాణం

pushpa 2 movie review and rating rashmika mandanna

పుష్ప పార్ట్ 1లో రష్మిక క్యారెక్టరైజేషన్ చేస్తే.. మరీ ఇంత చిల్లర చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. వెయ్యి రూపాయిలు ఇస్తే ఎగబడ చూడ్డానికి… ఐదువేలిస్తే ముద్దాటకి సిద్దమవ్వడాన్ని బట్టి చూస్తే.. శ్రీవల్లి పాత్రను ఎంత ‘గొప్ప’గా తీర్చిదిద్దాడో అర్థం చేసుకోవచ్చు సుకుమార్. ముద్దాటకి సిద్దమయ్యి.. పుష్ప రాజ్ ఎక్కడెక్కడో చేతులు పెట్టే సీన్‌లో కథానాయిక క్యారెక్టర్‌ని ఇంత దిగజార్చేశారేంటి? అని అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్‌లో. అందుకే శ్రీవల్లి గుబాళింపు ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్‌లో కనిపించదు.

ఇక పార్ట్ 2లో కూడా ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి.. మొగుడు వద్దంటున్నా మేడపైకి లాక్కుని వెళ్లిపోయి వంటగదిలోనే పనికానిచ్చే మోటు పెళ్లంగా శ్రీవల్లిని చాలా వైల్డ్‌ వైఫ్‌గా చూపించిన సుకుమార్.. సెకండాఫ్‌లోని జాతర ఎపిసోడ్‌లో ఇదిరా పెళ్లం అంటే అనేట్టు చూపించాడు. తన భర్తకి కులం లేదు.. గోత్రం లేదు అని అవమానిస్తుంటే.. ‘నీ కొడుకుని అంటే తల్లిగా నువ్వు ఊరుకుంటావేమో.. ఆడిపెళ్లం ఊరుకోదు’ అని చెప్పే డైలాగ్‌కి విజిల్స్ పడ్డాయి. పుష్ప అంటే పేరు కాదు.. అది బ్రాండ్ అంటూ చెప్పే డైలాగ్ కూడా పేలింది.

కొంచెం ఓవరాక్షన్

సీఎంని కలవడానికి వెళ్తున్న పుష్పరాజ్‌ని వచ్చేటప్పుడు అతనితో ఓ ఫొటో దిగయ్యా.. ఇరుగింటి పొరుగింటి వాళ్లకి చూపించి నా మొగుడు సీఎంతో ఫొటో దిగాడు అని గొప్పగా చెప్పుకుంటా అని ముచ్చటపడుతుంది శ్రీవల్లి. పుష్ప తన భార్య కోరిక తీర్చడానికి సీఎంతో ఫొటో అడుగుతాడు. ఎవడ్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి అని పుష్పని అవమానిస్తాడు సీఎం. దానికి పుష్ప రాజ్ ఇగో హర్ట్ అవుతుంది. సీఎం ఫొటో దిగలేదని కాదు.. తన భార్య కోరికను తీర్చలేకపోయాని.. ఆ దెబ్బతో రాష్ట్ర సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్ తన డబ్బు, పరపతి ఉపయోగించి.. ఆ తరువాత రావురామేష్‌ని సీఎంని చేసి.. నేరుగా ఇంటికి తీసుకొచ్చి శ్రీవల్లితో ఫొటో తీయించే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

సామీ.. ఫీలింగ్స్ వస్తున్నాయి సామీ అంటూ చాలా పచ్చిగానే రొమాన్స్ చేసింది శ్రీవల్లి పాప. పాటల్లో అయితే గ్లామర్ డోస్‌తో మోతాదుకి మించే ఉంది. ఫీలింగ్స్, సూసేకీ సాంగ్స్‌లో ఇద్దరూ కుమ్మేశారు. పుష్ప 2లో ప్రతిసాంగ్ సిచ్యువేషల్ సాంగ్. ఆఖరుకి కిసిక్కు సాంగ్ కూడా. ఈ సాంగ్‌కి థియేటర్స్‌లో గట్టిగానే ‘దెబ్బలు పడతాయ్ కుర్చీలకు’. అదొక్కటే కాదు.. ‘ఫీలింగ్స్’ సాంగ్‌కి అంతకి మించే దెబ్బలు పడతాయ్. ఆ సాంగ్‌కి ముందు వచ్చే సీన్‌లో ఫీలింగ్స్ వస్తున్నాయి అని అల్లు అర్జున్‌ని మేడపైకి లాక్కెళ్లే సీన్ చూసినా ఫీలింగ్సే సుమీ. రష్మిక అయితే గట్టిగానే ఫీల్ అయ్యి.. ఆ ఫీలింగ్స్ సాంగ్ చేయడం కాదు.. ఫీలింగ్స్ ఉన్న సీన్లను చేసింది. అవి థియేటర్స్‌లో చూస్తే.. ఫీలింగ్సే ఫీలింగ్సు.

మలుపు తిరిగే సీన్లు లేవు

బన్నీ రోల్‌ని హైలెట్ చేయడం.. కాస్త కథనం నెమ్మదిస్తుందన్న ప్రతిసారీ భారీ ఎలివేషన్స్ హై ఓల్టేజ్ సీన్లు పెట్టడంతోనే ‘పుష్ప 2’ నడిచిపోతుంది తప్పితే.. కథని మలుపుతిప్పే సీన్లు కానీ.. బలమైన ఘర్షణలు.. బలమైన ప్రతినాయకుడు.. ఆదిపత్య పోరు.. ఇలాంటివి ఏమీ కనిపించవు. ఓన్లీ పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ మాత్రమే కనిపిస్తుంటుంది ఆద్యంతం.

ఫాజిల్ మిడిల్ అవుట్

pushpa 2 review fahad fazil

ఫహాద్ ఫాజిల్‌కి ఫస్ట్ పార్ట్‌లో సరైన ప్రాధాన్యత దగ్గలేదని కంప్లైంట్ వినిపించింది. నిజానికి అతని నటనకు తగ్గ స్కోప్ నిజంగానే లేదు ఫస్ట్ పార్ట్‌లో. పార్ట్ 2లో భన్వర్ సింగ్ షేకావత్‌గా ఫుల్ లెంగ్త్ రోల్ ఉన్నా.. అతన్ని సీరియస్‌గా చూపించాలనుకున్నారా.. లేదంటే విలక్షణ నటనను బయటకు తీయాలనుకున్నారా ఏమో కానీ.. పార్ట్ 2లో కూడా ఫహాద్ ఫాజిల్‌‌ కన్ఫ్యూజన్ క్యారెక్టర్‌లాగే ఉంటుంది. ఆ పాత్రను కూడా అర్ధాంతరంగా ముగించినట్టే అనిపిస్తుంది.

పుష్ప కోసం పాత్రలన్నీ చంపేసాడు

pushpa2 public talk sunil

వీళ్లిద్దరూ ఎదురుపడే సీన్.. పుష్పరాజ్ క్షమాపణ చెప్పే సీన్.. ఆ తరువాత మూత్ర విసర్జన చేసి మరీ అవమానించే సీన్.. ఎర్రచందనాన్ని సముద్ర మార్గంలో బార్డర్ దాటించే సీన్.. ఢీ అంటే ఢీ అనేట్టుగానే ఉంటాయి. కానీ పుష్పరాజ్‌ని ఎలివేట్ చేయడానికి ఇతర పాత్రల్ని పెద్దగా హైలైట్ చేయాలేదేమో అనిపిస్తుంది. మంగళం శీనుగా సునీల్, దాక్షాయనిగా అనసూయ.. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నారు కాబట్టి.. సెకండ్ పార్ట్‌లోనూ ఉన్నారంటే ఉన్నారంతే. వాళ్లకి పెద్ద ప్రాధాన్యత లేదు. అయితే అజయ్‌కి మాత్రం అల్లు అర్జున్‌కి అన్నగా మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. ఇంటి పేరుని తన పేరు ముందు రావడానికి పుష్పరాజ్ పడిన ఘర్షణలో అజయ్ పాత్ర కీలకంగా అయ్యింది. రావు రమేష్ సీఎంగా.. జగపతిబాబు సెంట్రల్‌లో చక్రం తిప్పే సెంట్రల్ మినిస్టర్‌గా పెద్ద పాత్రలే చేశారు. అయితే జగపతిబాబు రోల్ పెద్దగా ఎలివేట్ కాలేదు.

పాటలు పర్వాలేదు

మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే.. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్లో స్లోగా ఎక్కేస్తుంటాయి. కిసిక్, ఫీలింగ్స్, సూసేకీ, పుష్ప.. ఇలా ప్రతి పాటని థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు. వినడానికే కాదు.. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే.. ఆ జాతర ఎపిసోడ్‌కి ఏం తాగి కొట్టాడో ఏమో కానీ.. పూనకాలు పుష్పరాజ్‌కి రావడం కాదు.. థియేటర్స్‌లో కూడా పూనకాలే. ప్రీ క్లైమాక్స్ ఫైట్‌కి ఇచ్చిన ఆర్ ఆర్ అయితే జాతర ఎపిసోడ్‌ని మించే ఉంది. మిరోస్లా కూబా బ్రొజెక్‌ సినిమాటోగ్రఫీ మరో మేజర్ హైలైట్ కాగా.. మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్‌తో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించేశారు.

అర్థాంతరంగా ముగింపు

అంతా బాగానే ఉంది కానీ… ఈ సినిమాకి మైనస్ అంటే క్లైమాక్స్. 3.20 నిమిషాలు పుష్ప రూల్ చూసిన తరువాత.. పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. మిగతాది ‘పుష్ప ది రాంపేజ్‌’ పార్ట్ 3లో చూసుకోండని అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. విస్తరి మొత్తం వడ్డించి.. ఇక తిన్నది చాల్లే లేవండి.. మిగతాది థర్డ్స్ పార్ట్‌లో తినొచ్చు అన్నట్టుగా బలవంతంగా కుర్చీలలో నుంచి లేపినట్టు అనిపిస్తుంది.

మొత్తానికి..

అన్నట్టుగానే అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ చూపించాడు. తగ్గేదేలే.. అస్సలు తగ్గేదేలే అన్న డైలాగ్‌కి తగట్టుగానే అస్సలు తగ్గలేదు. కానీ సగటు ప్రేక్షకుడు ఊహించిన కథను చూపించలేదు.. డైలాగ్స్ కన్ఫూజన్ తో ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com