అల్లు అర్జున్ నటించిన పుష్పకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. బన్నీ ఈ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించారు. ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో రిలీజైన పుష్ప-1 ఘన విజయాన్ని సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో పుష్ప-2 పై కూడా హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వచ్చిన పార్ట్ 2.. విడుదలైన రోజు నుంచే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద తన హవాని చూపించింది. ఒక్క బాలీవుడ్ లోనే వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. హౌస్ ఫుల్ థియేటర్లతో వరల్డ్ వైడ్ గా పుష్ప-2 1800 కోట్లు వసూలు చేసింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వేవ్స్’ సమ్మిట్ లో ఈ సినిమా గురించి కింగ్ నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. వేవ్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ‘పుష్పరాజ్’, ‘రాకీ భాయ్’ లాంటి పాత్రలు కొత్తగా అనిపించకపోవచ్చని అన్నారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు అవి సరికొత్త అనుభవం అన్నారు. అలాంటి పాత్రలు చూసినప్పుడు వారు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. కథను నిజాయితీగా చెప్పినప్పుడు అది ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. బాహుబలి ఇందుకు అద్భుత ఉదాహరణ అని తెలిపారు. కేవలం హీరోల ఎలివేషనే కాదు బలమైన కథలతోనే ఆయా చిత్రాలు విజయాలు సాధించాయని చెప్పుకొచ్చారు. నాగార్జునతో పాటు అమీర్ ఖాన్, కరీనా కపూర్, విజయ్ దేవరకొండ సహా పలువురు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు.