Wednesday, December 25, 2024

రాజీనామా చేసి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

రుణమాఫీపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ
సవాల్‌ చేసిన కేటీఆర్‌
వివరణ ఇచ్చిన సర్కారు
సభలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య వార్‌

రాష్ట్రంలో రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. రైతు రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని కేటీఆర్‌ ప్రకటించారు. కొండారెడ్డి పల్లి, పాలేరు.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దామని సవాల్‌ చేశారు. అసెంబ్లీలో రుణమాఫీపై శనివారం చర్చ జరిగింది. దీనిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రుణమాఫీపై రైతులను అడుగుదామని, వంద శాతం రుణమాఫీ అయినట్లు నిరూపించాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు.

రైతు భరోసాను ప్రారంభించింది మేమే: కేటీఆర్‌
రైతుబంధుపై సమగ్ర చర్చ జరగాలని, రైతు భరోసాను ప్రారంభించింది తామేనని స్పష్టం చేశారు. రైతుబంధుతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని, రైతుబంధుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. రైతుబంధు ఒక పంటకు ఇస్తారో లేక.. రెండు పంటలకు ఇస్తారో ప్రభుత్వం వివరించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. అదాని కోసం సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ రైతులను జైల్లో పెట్టారని, కేవలం అనుముల కుటుంబం కోసం, బామ్మర్ది కోసం, అన్నదమ్ముల కోసం పని చేయకండి అని హితవు పలికారు. అన్నదాతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలని, రైతు రుణమాఫీ పూర్తిగా జరిగింది అంటున్నారని.. 60 శాతం అయ్యిందని మరొకరు అంటున్నారని చెప్పారు. రైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పాలన్నారు. 25 శాతమా, 50 శాతమా మంత్రులకే స్పష్టత లేదని విమర్శించారు. డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీపై మొద‌టి సంత‌కం పెడుతా అన్నారని, ఏక‌కాలంలో ఒక‌టే పెన్ స్ట్రోక్‌తో రుణ‌మాఫీ చేస్తా అని ప్రకటించారని, డిసెంబ‌ర్ 7న స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ మీటింగ్‌లో రుణ‌మాఫీ కోసం రూ. 49 వేల 500 కోట్లు అని చెప్పారని వివరించారు. కానీ, రుణమాఫీ లెక్కలు కేబినెట్‌కు వ‌చ్చే వ‌ర‌కు రూ. 31 వేల కోట్లు, బ‌డ్జెట్‌కు వ‌చ్చేస‌రికి రూ. 26 వేల కోట్లు అయిందని, పాల‌మూరు విజ‌యోత్స‌వ స‌భ‌లో రూ. 19 వేల కోట్లు అని సీఎం చెప్పారన్నారు.

అసెంబ్లీ ఆలస్యంపై హరీష్‌రావు ఫైర్
శాసనసభ పది నిమిషాల ఆలస్యంగా ప్రారంభం కావటంపై మాజీ మంత్రి హారీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10గంలకు ప్రారంభంకావాల్సిన సభ.. 10.10గంకు ఎందుకు ప్రారంభం అయిందని, సభను సమయానికి ఎందుకు నడపడం లేదని హరీష్‌రావు నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు సభను సమయానికి నడిపామని గుర్తుచేశారు. చట్టాలు చేసే మనం ఆదర్శంగా ఉండాలని, సభను సమయానికి ప్రారంభించాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

కోమటిరెడ్డి వర్సెస్‌ హరీశ్‌రావు
మిషన్ భగీరథ ఖర్చే రూ.28వేల కోట్లు అయిందని, అందులో రూ.50వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. మంత్రికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నల్గొండకు ఏం చేయలేదు అనడం సరికాదని హరీష్‌రావు పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్లలో తామే అంతా చేశామని చెప్పడంపై మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో కొత్త ఆయకట్టుకు ఒక్క ఎకరాకు నిధులు ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. పదేపదే హిస్టరీ గురించి చెప్పడంపై కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడ్డారు. చివరకు స్పీకర్ జోక్యంతో చర్చ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో పిలవడం సరికాదని కేటీఆర్‌కు సూచన చేశారు స్పీకర్. తానేమీ తిట్టలేదంటూ మళ్లీ కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత చర్చ మొదలైంది. ఇక, పదేళ్లలో నీళ్లు, నిధులు ఎక్కడంటూ మంత్రి కోమటిరెడ్డి ఎదురుదాడికి దిగారు. రేపో మాపో మేడిగడ్డ కూలిపోతుందని రిపోర్టు ఇచ్చారని, పదేళ్లలో మీరు ఏం చేశారని మండిపడ్డారు. సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈలోగా కేటీఆర్ మాట్లాడుతూ సభను 10 రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com