- కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో రాహుల్ సమావేశం
- దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం
- కులగణనపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నడుస్తోంది
- ప్రతి ఒక్క కార్యకర్త కులగణన సర్వేలో పాల్గొనాలి
- ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్‌లను
- అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలుగా నియమిస్తాం
- టిపిసిసి ఆధ్వర్యంలో కులగణనపై
- ఈ నెల 6 లేదా 7వ తేదీ న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం
- బిజెపి ఆఫీస్‌లో మహేశ్వర్ రెడ్డికి కుర్చీలేదు
- కిషన్ రెడ్డికి, ఏలేటిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది
- పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై ఈనెల 05వ తేదీ సాయంత్రం 4 గంటలకు బోయినపల్లిలోని కాంగ్రెస్ ఐడియాలజీ సెంటర్‌లో పిసిసి ఆధ్వర్యంలో మేధావుల అభిప్రాయ సేకరణ నిర్వహించబోతున్నామని, ఈ సమావేశానికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని సమయం దొరికితే ఈ కార్యక్రమానికి ఆయన కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్ గాంధీ వివరాలు తెలుసుకుంటారన్నారు. శనివారం గాంధీభవన్‌లో కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. దేశంలో ఎవరు ఎంత జనాభా ఉంటే అంతే ఫలాలు అందాలని రాహుల్ గాంధీ భావించారన్నారు. కులగణనపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నడుస్తుందని, కులగణనపై కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సర్వేలో పాల్గొనాలని ఆయన సూచించారు. పథకాలు జనాలకు సరైన రీతిలో అందుతున్నాయా లేదా అన్నది అబ్జర్వర్‌లు పరిశీలిస్తారన్నారు. టిపిసిసి ఆధ్వర్యంలో కులగణన అంశంపై ఈ నెల 6 లేదా 7వ తేదీ న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.
సీనియర్లను కో ఆర్డినేటర్లుగా నియమిస్తాం
ప్రధాని మోడీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, ఆయన ప్రశ్నలను సైతం అంగీకరించరని ఆయన విమర్శించారు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం అందుకు భిన్నంగా విమర్శలను కూడా రాహుల్ గాంధీ పాజిటివ్ గా తీసుకుంటారన్నారు. వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే పిసిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాహుల్ వచ్చేందుకు అంగీకరించారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏదైనా సలహాలు, సందేహాలు ఉంటే ఈ కనెక్టివిటీ సెంటర్‌ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. భవిష్యత్ అవసరాలు, కార్యక్రమాల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లను వారి జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా పంపించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. సీనియర్లను కో ఆర్డినేటర్లుగా నియమిస్తామని ఆయన తెలిపారు.
మహేశ్వర్ రెడ్డికి దక్కుతున్న గౌరవం ఏమిటో అందరికీ తెలుసు….
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు స్వతంత్రంగా పని చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఉండగా కొత్త ముఖ్యమంత్రి ప్రస్తావన తెస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బిజెపిలో దక్కుతున్న గౌరవం గురించి ఆలోచించుకోవాలని పిసిసి అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. అక్కడ ఆయనకు ఇస్తున్న గౌరవం గురించి అందరికీ తెలుసన్నారు. మహేశ్వర్ రెడ్డి తనకు మంచి మిత్రుడే కానీ, కాంగ్రెస్‌లోని విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు.
ఉత్తమ్, భట్టి అందరూ సీనియర్ నేతలని, సీనియర్ మంత్రులతో కూడిన సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛగా, సజావుగా పనిచేస్తుందన్నారు. బిజెపి ఆఫీస్‌లో మహేశ్వర్ రెడ్డికి కుర్చీలేదని, కిషన్ రెడ్డికి ఏలేటికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయన్న సమాచారం తమకు ఉందన్నారు. తమ పార్టీ గురించి వేరేవాళ్లు కామెంట్ చేస్తే ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ మిగతా ఏ పార్టీలో లేదని, బిజెపిలో అంతకన్నా లేదన్నారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తిలో ఉన్నారని ఆయన తెలిపారు. వంచనకు గురిచేసిన కెసిఆర్‌ను ప్రజలు దించేసి తమ మీద ఉన్న నమ్మకంతో తమకు అధికారం అప్పగించారన్నారు. ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం మాలో ఎవరు మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారని కాదని, ప్రజలకు ఎలా మేలు చేయాలని తాము ఆలోచిస్తున్నామన్నారు.
మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న మోడీ ముందు ఆయన ఇస్తానన్న సంక్షేమ పథకాలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొత్తవి ఇచ్చే బదులు ప్రభుత్వ సంస్థలను అమ్మేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలు, రైతుల గురించి మాట్లాడే హక్కు మోడీకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ మాదిరిగా తమది ఫాసిస్టు ప్రభుత్వం కాదన్నారు. కులగణన సమగ్రంగా నిష్పక్షపాతంగా జరగాలన్నదే తమ ఆలోచన అని ఆయన అన్నారు. కెసిఆర్ చేసిన సమగ్ర కులగణన రిపోర్టు ఏమైందని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
ప్రజా ధనంతో ఆగమేఘాల మీద సర్వే చేసిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ఆయన విమర్శించారు. మల్లికార్జున ఖర్గే మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆర్థిక పరిస్థితి చూసుకొని హామీలు ఇవ్వాలని ఖర్గే చెప్పారన్నారు. మూసీకి లక్షకోట్లని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు దుయ్యబట్టారు. డిపిఆర్ సిద్ధం కాకుండా లక్ష కోట్లని ఎలా చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చిన ఆరుగ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పిసిసి అధ్యక్షుడు పేర్కొన్నారు.