తనపై త్వరలోనే ఈడీ దాడులు జరుగుతాయని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు కేంద్రం తనపై కక్ష్య సాధింపు చర్యలు దిగేందుకు సిద్దమవుతోందని ఆయన ఆరోపించారు. తాను లోక్ సభలో కేంద్ర బడ్జెట్ పై ప్రసంగం సందర్బంగా లెవనెత్తిన అంశాలను ఈ సందర్బంగా ప్రస్తావించారు రాహూల్ గాంధీ. దేశం మొత్తాన్ని కేవలం ఆరుగురు వ్యక్తులు పద్మవ్యూహం లోకి నెట్టివేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మహాభారతంలోని కురుక్షేత్ర యుధ్దంలోని కీలక పద్మవ్యూహా ఘట్టాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులపై లోక్ సభలో ప్రసంగం సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు రాహూల్ గాంధీ. పార్లమెంట్ లో తన ప్రసంగం నచ్చకే కేంద్రం తనపై ఈడీని ఊసిగొల్పుతోందని రాహూల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
ఈమేరకు రాహూల్ ట్విట్టర్-ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. “ సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదు. నాపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు చెప్పారు. చాయ్, బిస్కెట్లతో వారిని ఆహ్వానించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మొత్తానికి తనపై ఈడీ దాడులు జరగబోతున్నాయంటూ రాహూల్ గాంధీ అనుమానం వ్యక్తం చేయడం జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.