-
రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారు
-
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు
కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ మేనిఫెస్టో దిక్సూచీ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ బిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని అధిష్టానానికి ఆయన సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ కనుమరుగు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కేంద్రంలో ఉన్న సపోర్ట్‌తో బిజెపి నేతలు అత్యుత్సాహం చేస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారికి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో బిజెపి డిపాజిట్ కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. రెండు సీట్లకే బిజెపి పరిమితం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.